పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

గరిమ వైశ్వదేవికముఁ జేసి బలిహర, ణార్థమై నిదాఘుఁ డాత్మగృహము
వెడలి వచ్చునపుడు వెలుపట నిలుచున్నఁ, యతనిఁ దెలియలేక యతిథి యనుచు.

345


తే.

ఆదరంబునఁ గొనివచ్చి యాసనార్ఘ్య, పాద్యములఁ బూజ గావించి బడలివచ్చి
నారు వంటకమైనది యారగింపుఁ, డనిన నవ్వప్రుఁ డిట్లను నతనితోడ.

346


క.

నాకుఁ గదన్నంబులపై, నేకాలము మనసుపుట్ట దిపుడు పదార్థా
నీకము లెట్టెట్టివి పరిపాకము సేయించి తనినఁ బౌలస్త్యుండున్.[1]

347


క.

తనయింట నప్పు డాయిత, మొనరించినకమ్మదావు లొలుకురసావ
ళ్లును మినువవడలుఁ జూపట్లును గోదుమపిండివంటలుం గలవనినన్.[2]

348


ఆ.

ఇపుడు చెప్పినట్టి విన్నియుఁ గడుఁ గద, న్నంబు లింక షడ్రసంబులందు
మించియున్న మంచిమృష్టాన్నపానంబు, లాయితంబుగాక యారగింప.[3]

349


చ.

అనిన నిదాఘుఁ డప్పుడు కులాంగనశాలినిఁ జూచి వేగ నీ
యనకు భుజింపఁగా దగినయన్నము పాకము సేయుమన్న న
వ్వనరుహనేత్ర చిత్రముగ వండి భుజింపఁగఁ బెట్టె నమ్మహా
త్మునకును బ్రాణనాథునకు మోదముతో సరసాన్నపానముల్.

350


వ.

ఇట్లు భుజించి స్వస్థచిత్తుండై కూర్చున్న ఋభునకు నిదాఘుం డిట్లనియె.

351


క.

ఇయ్యాహారంబులచే, నయ్యా బడలికలు దీఱెనా సంతోషం
బయ్యున్నదె పరితుష్టం, బయ్యెన్ ప్రొద్దెక్కి మిగుల నాఁకొంటివిగా.[4]

352


క.

ఎందుండి వచ్చితిరి మీ, రెందుల కేగెదరు నిలయ మెచ్చో టనినన్
మందస్మితుఁ డగుచు ద్రుహిణ, నందనుఁ డిట్లనుఁ బులస్త్యనందనుతోడన్.[5]

353


క.

కడు నాఁకలి గొని యన్నము, గుడిచినవారలకుఁ దృప్తి గూరును మున్నె
ప్పుడు నాఁకలి చెందకయుం, డెడునను నేమిటికి ని ట్లడిగితి మహాత్మా.[6]

354


చ.

అనవరతంబుఁ బార్థివములై కనుకుట్టెడు ధాతుసంచయం
బును దనమేననున్నజలమున్ జఠరాగ్నియ కాల్చు విప్రనం
దన కడలేనియాఁకలియు దాహము రెండును దేహధర్మముల్
మునుకొని యావికారములు మున్నును నేడును లేవు నా కిలన్.[7]

355


వ.

అని మఱియును.

356


ఆ.

కాన నాకుఁ దృప్తి గల దెల్లకాలంబు, తనకు నొదవుతుష్టియును సుఖంబుఁ
జిత్తధర్మములు విశేషచిత్తము గల, యట్టి వారి నడుగు మవ్విధములు.

357


వ.

కావునఁ బరమాత్మునకు నివ్విధంబులు లేవు.

358
  1. కదన్నంబులపైన్ = కుత్సితాన్నముమీఁద.
  2. కమ్మతావులొలుకు = మధురమైన వాసనలను వ్యాపింపఁజేయుచున్న, చాపట్లు = దోసలు.
  3. మృష్ట = మధురమైన, ఆయితంబు = సిద్ధము.
  4. పరితుష్టంబు = చక్కగా తృప్తిపొందినది, ఆఁకొంటివిగా = ఆఁకలి గొంటివికదా.
  5. మందస్మితుఁడు = చిఱువ్వుగలవాఁడు.
  6. కూరును = కలుగును.
  7. పార్థివములు = పృథివివలనఁ గలిగినవి, (పృథివి = భూమి,) ధాతుసంచయము = ధాతుపదార్థముల సమూహము.