పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనధనధాన్యబాంధవజనంబులఁ గోరుట యెల్ల హేతువై
యనయము నుండుఁ గానఁ బరమార్థము గాదు తలంచి చూచినన్.

327


క.

సవనము శ్రేయస్కరమని, వివరించిన ఫలములందు వేడుక గలమా
నవులకు స్వర్ణము నిచ్చిన, యవనీశ్వర యదియుఁ బారమార్థిక మగునే.

328


మ.

పరమధ్యానము సేయుమంచును మదిన్ భావించినన్ జీవుఁడున్
బరమాత్ముండును యోగవిద్యవలనన్ శ్రాపింతు రేకస్థితిన్
ధరణీనాథ తదీయదర్శనమహత్వప్రాప్తికిన్ హేతువై
పరఁగుం గావునఁ బారమార్థికము చెప్పన్ వచ్చునే యెమ్మెయిన్.[1]

329


సీ.

ధర్మార్థు లగుచుఁ కొందఱు ధనంబు వ్యయంబు సేయంగ ధర్మంబుఁ జెందు నందుఁ
గొందఱు తమతమకోర్కి కర్థము లిత్తు రందుఁ గామఫలంబు లనుభవింతు
రవి మొదలయిన యనేకధర్మంబులు పరమార్థములుగఁ జెప్పంగరాదు
పుత్రునిఁ బరమార్థముగ నిరూపించినఁ దనతండ్రికిఁ దనయుఁ డగుటఁ


తే.

బట్టి పరమార్గములు పరంపరలఁ జెల్లుఁ, గాని యిదమిత్థమని పలుకంగఁబోల
దవనిరాజ్యంబు పరమార్థ మనిన నది గ, లిగినఁ గలుగును లేకున్న లేకపోవు.[2]

330


తే.

ఋగ్యజుస్సామములయందు నీడితంబు, లైనయాగంబులును బరమార్ధములుగ
నెట్లు చెప్పంగవచ్చు నరేంద్ర కర్మ, ఫలనిరూపణవృత్తిఁ జూపట్టు నవియు.[3]

331


క.

ఏయేకారణములచే, నేయేకార్యములు వుట్టు నీప్సితములతో
నాయాహేతువు క్రియలం, దాయాఫలములు ఘటిల్లు నదియె ట్లనినన్.[4]

332


ఆ.

ధారుణీవశమును గారణరూప మై, నట్టిమంటివలనఁ బుట్టినట్టి
కార్యరూప మయినఘటములు గారణ, రూప మయినమంటిరూప కాన.

333


ఉ.

కావున నాశభావములు గైకొనుచున్న సమిత్కుశాక్షతా
జ్యావలిచేత వేల్వఁబడు యాగపుఁగర్మములున్ వినాశమై
పోవునెకాని సుస్థిరతఁ బొంది వెలుంగవు దీర్ఘ కాలమున్
భూవర కార్యకారణములుం బరమార్థములే తలంపఁగన్.

334


ఆ.

విమలకర్మగోచరము లైనఫలముఁలు, బుద్బుదములపోలెఁ బుట్టు నణఁగు
దేశకాలముల కధీనంబు లైనవి, తత్వ మనుచుఁ జెప్పఁ దగుట యెట్లు.[5]

335


క.

భూపాలతిలక కడుసం, క్షేపంబుగ నీకుఁ దెలియఁజెప్పెదఁ బరమా
ర్థోపాయరహస్యంబులు, దీపింపఁగ సూక్ష్మబుద్ధిఁ దెలియుము మదిలోన్.[6]

336


శా.

ఏకవ్యాపకమై సమస్తగతమై హేవాకమై శ్రీకరం

  1. ప్రాపింతురు = పొందుదురు.
  2. ఇదమిత్థ మని = ఇది యిట్లు అని, పలుకఁబోలదు = చెప్పఁదగదు.
  3. ఈడితంబులు = కొనియాడఁబడినవి - చెప్పఁబడినవి యనుట.
  4. ఈప్సితములతోన్ = కోరికలతో, ఘటిల్లున్ = కలుగును.
  5. బుద్బుదములపోలెన్ = నీళ్లలోని బుగ్గలవలె.
  6. భూపాలతిలక = రాజశ్రేష్ఠుఁడా.