పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరఁగుం గాని యఖండపుఁ, బరమాత్మకు సంజ్ఞ గాదు పార్థివచంద్రా![1]

315


తే.

దేవతిర్యఙ్మనుష్యాదిదేహభిత్తు, లెవ్వియును నాత్మ గాదు నరేంద్ర యీవి
కారదేహంబు లెల్లను గర్మయోను, లనుచుఁ జెప్పుదు రప్పరమార్థవిదులు.[2]

316


క.

పలుమాఱు రాజభృత్యా, దులు వస్తువు లంటిమేని తొల్లిటితమసం
జ్ఞలు మాని యన్యనామం, బులఁ జెందెడుఁ గానఁ జెప్పబోలదు నియతిన్.

317


తే.

అనఘ కాలంబువలన నామాంతరమునఁ, బొంద దెయ్యది యదియపో భూరివస్తు
వట్టివస్తువునకును బాల్యాదిసంజ్ఞ, లేమియును లేవు నీ వది యెఱిఁగికొనుము.

318


తే.

ఎల్లప్రజలకు రాజగుఁ దల్లిదండ్రు, లకు సుతుం డగు సత్పుత్రులకును దండ్రి
తనదుభార్యకు మగఁ డగు ధరణినాథ, యిన్నిసంజ్ఞలు గలనిన్ను నెవ్వఁ డండ్రు.

319


తే.

ఇట్టిసకలావయవములకెల్ల నన్యుఁ, డగుదువేనియు నహ మంట దగును నిట్లు
గాకయుండిన నెట్లు పల్కంగవచ్చు, నిది వివేకించి చూడు నరేంద్రచంద్ర.

320


వ.

కావునఁ దత్వంబు పృథక్కరణనిష్పాద్యంబై యున్నయది సోహంభావన నెట్లు
సేయుదువని పరమార్థయుక్తంబుగా నుపన్యసించిన విని రాజు విచారవిభ్రాంతచి
త్తుండై యిట్లనియె.[3]

321


తే.

నీవు చెప్పినపరమార్థనిశ్చయముల, వలన నాచిత్త మేమియుఁ దెలివిలేక
యధికవిభ్రాంతి నొందిన ట్లగుచునున్న, యది మహాత్మక నాసంశయంబు మాన్పు.

322


క.

అనఘాత్మ మీరు నాకును, వినిపించిన యావివేకవిజ్ఞానము భూ
జనులందును బ్రత్యక్షం, బొనరించుచు నున్నయది సముజ్జ్వలవృత్తిన్.

323


వ.

అది యట్లుండెఁ బరమార్థం బైనశ్రేయస్స్వరూపంబు నాకు నెఱుంగవలయు నేత
న్నిమి త్తంబుగాఁ బరమతత్త్వబోధకుం డైనకపిలమహాముని నడుగఁబోవుచున్నాఁడ
నమ్మహాత్మునకుం గలపరమార్థతత్వపరిజ్ఞానంబు మీయందును గలదు గావున
మిమ్ము నే యుపాసించెద నన్నుఁ బరిగ్రహించి నామనోరథంబు లీడేర్పుం
డనినఁ బుడమిఱేనికి నప్పాఱుం డిట్లనియె.

324


క.

ఎడపక పరమార్థము న న్నడిగెదవో శ్రేయ మిప్పు డడిగెదనో యే
ర్పడఁ జెప్పుము శ్రేయంబులు, కడుఁ బరమార్థ ప్రదములు గావు నరేంద్రా.

325


క.

శ్రేయము పరమార్ధము గా, దా యని యడిగెదవయేని ధరణీవర యా
శ్రేయోలక్షణములు ప, ర్యాయంబునఁ బెక్కువిధములై చూపట్టున్.

326


చ.

గొనకొని యిష్టదైవతము గొల్చి వరంబులు గొంట శ్రేయమా
నని తలపోనెదేని మనుజాధిప నిర్మలరాజ్యభోగము

  1. సరవిన్ = క్రమముగా.
  2. దేహభిత్తులు = దేహములనెడు గోడలు.
  3. పృథక్కరణనిష్పాద్యంబు = వేఱుచేసి చెప్పఁదగినది, ఉపన్యసించిన = చెప్పఁగా, ఆవిచారవిభ్రాంతచిత్తుఁడు = విచారణలేమిచే భ్రమనొందిన మనసుగలవాఁడు.