పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

బ్రహ్మవిద్యార్ధియైన యిక్షుమతీతీరంబునఁ దపంబు చేయుచున్న కపిలమహాముని
కడకుం జనువాఁడై శిబికారోహణంబు చేసి చనునప్పుడు.[1]

281


క.

ఆదివ్యయోగి నృపురథ, చోదకుచే నెంతయును బ్రచోదితుఁడై న
వ్యోదనవేతనుఁ డగుచును, మోదంబున రాజుశిబిక మూఁపునఁ దాల్చెన్.[2]

282


వ.

ఇట్లు వాహకులం గలసి తాను నందఱియట్ల యరుగుచుండి పురోభాగంబున
నాత్మీయదృష్టి యుగప్రమాణదూరంబున నిలిపి మందమందగమనంబునఁ బోవు
చుండి శిబిక జడిసి విషమంబుగా నరుగుచున్నం గనుంగొని రాజు వాహకులం
బెక్కుమాఱులు గోపించి విషమగమనంబు మాని నడువుం డనిన వార లిట్లనిరి.[3]

283


తే.

ఎవ్వఁడో కాని వీఁడు నరేంద్ర శిబిక, పూని మముఁ కూడి నడచి రాలేనికతన
జడియుచున్నది యనిన నాజనవిభుండు, మందహాసంబుతోడ బ్రాహ్మణునిఁ జూచి.[4]

284


ఆ.

త్రోవ నడిచి మిగుల దూరంబు వచ్చుట, వీఁక శిబిక మోపలేక మిగుల
నలసినాఁడవో ప్రయాపంబు నీ కౌట, యెట్లు పీవరాంగ మింత గలిగి.[5]

285


వ.

అనిన బ్రాహ్మణుం డిట్లనియె.

286


క.

బడలికయు లేదు త్రోవయు, నడచి యరుగు దేను శిబిక నాచేఁ బూన్పం
బడదెట్లు నీవు చూచితొ, కడుబలిసినమేను నాకుఁ గలుగుట యెట్లో.

286


వ.

అనిన రా జిట్లనియె.

287


క.

ఇట్టివిధంబులు నిఖలము, నెట్టనఁ బ్రత్యక్షముగను నీవలనను జూ
పట్టఁగ శిబికాభారం, బెట్టో లేదంచుఁ బలికి తిప్పుడు నాతోన్.[6]

288


వ.

అనిన బ్రాహ్మణుం డిట్లనియె.

289


క.

విను నీవు శిబిక నుండుట, యును నే నీభరముఁ దాల్చి యుండుటయును రెం
డును మిథ్య లెవ్వ రెవ్వరి, నొనరఁగ భరియింతురో నరోత్తమ వినుమా.[7]

290


సీ.

పాదయుగ్మమువ్రేఁగు భరియింప వసుమతి జంఘలఁ బదపంకజములు పూనె
నూరువులను జంఘ లొనరంగఁ దాలిచె నూరువుల్ భరియించె నుదరభరము
వక్షస్స్థలం బెల్ల వహియించె నుదరంబు వక్షంబు భుజగౌరవంబుఁ బూనె
శిబికభుజంబులచే భరింపఁగనుండె శిబికయుఁ దదుపలక్షితశరీర


తే.

భారమెల్ల వహించె నిప్పాట నొక్క, రొకరిభారము భరియించుచున్నవారు

  1. శిబికారోహణంబు చేసి = అందలము నెక్కి.
  2. రథచోదకుచేన్ = రథము తోలువానిచేత - సారథిచేత, ప్రచోదితుఁడు = ప్రేరేరింపబడినవాడు, నవ్యోదనవేతనుఁడు = క్రొత్తకడుపుకూటివాఁడు.
  3. ఆత్మీయదృష్టిన్ = తనచూపును, యుగప్రమాణ = కాఁడికట్టునంతటికొలఁదిగల, జడిసి = అదిరి, విషమంబుగాన్ = ఎగుడుదిగుడుగా.
  4. మందహాసంబుతోడన్ = చిఱునవ్వుతో.
  5. వీఁకన్ = అడఁకువతో, పీవరాంగము = బలిసిన దేహము.
  6. నెట్టనన్ = మిక్కిలి.
  7. భరము = భారము, భరియింతురో = మోయుదురో.