పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కీమేను విడువఁ బాటిలె, నేమని దుఃఖంతు దైవ మెంతకుఁ దెచ్చెన్.[1]

266


వ.

అని బహుప్రకారంబులు నాయిఱ్ఱికొదమ నక్కునం గదియ నదిమి దుఃఖించుచు
తదీయమోహపాశబద్ధుండై ప్రాణపరిత్యాగఁబు చేసి దేహాంతరంబున జాతిస్మర
త్వంబు గలిగి యేణసంగదోషంబువలన జంబూమార్గంబున నొక్కపుణ్యారణ్యం
బున హరిణంబై జన్మించి పూర్వజన్మసంస్కారంబున నైనపుణ్యంబునం జేసి మాతృ
పరిత్యాగం బొనరించి.[2]

267


క.

సాలగ్రామమునకుఁ జని, తాలిమితోఁ బూర్వపరిచితం బగుయోగ
శ్రీలలితబుద్ధిఎ దప్పక, యాశీలఁ జరించుచుండె హరిణము తెలివిన్.

268


క.

వెస వో నెండినయాకులు, గసువులు మేయుచును దేహగౌరవ మొకరీ
తి సమాప్తిఁ బొందఁజేయుచు, నసదృశగతి సంచరించు నామృగ మచటన్.[3]

269


వ.

ఇవ్విధంబున దేహయాత్ర చేసి కొంతకాలంబునకు శరీరంబు విడిచి.

270


మ.

సకలామ్నాయరహస్యవేది యగుచున్ శాస్త్రార్థతత్త్వజ్ఞుఁ డై
ప్రకటజ్ఞానగరిష్ఠుఁడై యతలితబ్రహ్మజ్ఞుండై నిర్మల
స్వకులాచారపరాయణప్రముఖుఁడై జాతిస్మరత్వంబుతో
నొకవిప్రోత్తముఁడై జనించె ధరపై యోగీంద్రవంశంబునన్.[4]

271


వ.

ఇట్లు జన్మించి జడవేషంబునం బెరిగి యథాకాలంబునఁ గృతోపనయనుండై గు
రూపదేశమార్గంబు లైన వేదపాఠంబులు తనవివేకంబునకు నిస్సారభూతంబు
లైనం చిరస్కరించి పూర్వజన్మంబున హరిణసంగతదోషంబున ననేకదుఃఖంబు
లనుభవించినవాఁ డగుటం జేసి నిస్సంగహేతుకంబులును సకలజనావమానంబు
లును నైనకర్మంబు లాచరించుచు నుండి.[5]

272


తే.

యోగి ప్రచ్ఛన్నవృత్తిమై నుండకున్నఁ, బరమతత్వైకచింత కుపాధి పుట్టు
ననుచు మును పంకజాసనుఁ డానతిచ్చి, నట్టి వేదార్థపద్ధతు లాత్మఁ దలఁచి.[6]

273


మ.

జడవేషంబును గ్రామ్యభాషలు నవిస్పష్టానులాపంబులుం
గడుమాలిన్యశరీరముం బటుకురాగాక్రాంతకేశంబులున్
బెడఁకుంజూపులు క్లిన్నదంతచయమున్ వెఱ్ఱాటలున్ బాటలున్

  1. కుఱ్ఱ = బిడ్డ, పాటిలెన్ = కలిగెను.
  2. అక్కునన్ = ఱొమ్మునందు, జాతిస్మరత్వంబు = పూర్వజన్మమునందు తానున్నవిధము తెలిసినతనము.
  3. దేహగౌరవము = శరీరముయొక్క ఘనత.
  4. ఆమ్నాయరహస్యవేది = వేదార్థరహస్యముల నెఱిఁగినవాఁడు, గరిష్ఠుఁడు = గొప్పవాఁడు.
  5. యథాకాలంబునన్ = తగినకాలమున, నిస్పంగహేతుకంబులు = సంగములేమికి కారణములైనవి.
  6. ప్రచ్ఛన్నవృత్తిమైన్ = మఱుఁగుపడిన వర్తనముతో, ఉపాధి = లోపము.