పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సకలప్రాణులు వెఱవఁగ, నొకసింహము ఘోరనాద మొనరించుటయున్.[1]

251


తే.

ఆపటుధ్వని విని యేణి యధికభీతి, తోడ నీరాన వెఱచి ప్రోత్తుంగలంఘ
నంబు గావించుటయును గర్భంబు పతన, మయ్యె నావాహినీసలిలాంతరమున.[2]

252


చ.

మృగియును నానదీజలసమీపమునం బడి చచ్చె మ్రానుతోఁ
దగిలి తదీయశాబకము దత్సలిలంబులఁ దేలి పోవఁగా
జగతివిభుండు చూచి విలసత్కరుణారసపూరితాత్మకుం
డగుచు రయంబునం జని ప్రియం బొదవం దరియందుఁ బెట్టినన్.[3]

253


తే.

కొంతసేపున కాయిఱికొదమ లేచి, యల్లనల్లన మెలఁగుచు నాఁకటికిని
దల్లి చన్నులు గుడువంగఁ దత్తఱించు, చున్నఁ గనుఁగొని యారాజయోగివరుఁడు.[4]

254


తే.

దానిప్రాణంబు రక్షింపఁ దలఁపు చేసి, యతఁడు దనయాశ్రమమునకుఁ గుతుక మొదవఁ
దెచ్చి పోషించుచుండంగ దినదినంబు, వృద్ధిఁ బొందుచునుండెను విప్రముఖ్య.[5]

255


క.

నానాఁటికి మృగశాబం, బానరనాయకపరిగ్రహంబునఁ బొదలెన్
భానునిచే సితపక్షక, ళానిధి యభివృద్ధిఁ బొందులాగున ననఘా.[6]


సీ.

పూరి మేయఁగ దవ్వు వోయి బెబ్బులిపిండుదిగులునఁ గ్రమ్మఱఁ దిరిగివచ్చు
సారెసారెకుఁ దదాశ్రమసమీపంబున వేడ్కతో గంతులు వేయుచుండు
మలయుచు వచ్చి కోమలశృంగయుగ్మంబుచేత నెమ్మేనికండూతి దీర్చు
యోగాసనంబున బాగుమీఱఁగ నుండ మవ్వంపుఁదొడలపైఁ బవ్వళించుఁ


ఆ.

బర్ణశాలచుట్టుఁ బరువులు పెట్టుచు, లేఁతయైన పూరి మేఁత మేయు
ననుదినంబు నిట్టు లామృగశాబంబు, ముద్దుచూపుచుండు మునివరునకు.[7]

257


క.

ఒక్కొకనాఁ డాఁకటితో, మిక్కిలిదూరంబు వోయి మృగశాబము ప్రొ

  1. కకుబంత...గతిన్ = దిక్కులకడలు తిరుగుడు పడునట్టి భయంకరమైన ప్రసిద్ధమైన ప్రళయకాలపురుద్రమూర్తియొక్క గొప్పధ్వనివలెనే.
  2. నీరానన్ = జలపానము చేయ, ప్రోత్తుంగలంఘనంబు = మిక్కిలి యెత్తుగా దాఁటుటను, పతనమయ్యెన్ = దిగఁబడియెను, వాహినీసలిలాంతరమునన్ = ఏటినీళ్లలో.
  3. మృగి = ఆఁడుమృగము, శాబకము = పిల్ల, తత్సలిలంబులన్ = ఆనదినీళ్లయందు, జగతివిభుండు = భూపతి - రాజు, విలస...పూరితాత్మకుఁడు = ఒప్పిదమైనదయారసముచేత నిండింపఁబడిన మనసు గలవాఁడు - మిక్కిలిదయ గలవాఁడు, రయంబునన్ = శీఘ్రముగా.
  4. కొదమ = పిల్ల, అల్లనల్లన = మెల్లమెల్లగా, తత్తఱించుచున్ = తమకపడుచుండఁగా.
  5. తలఁపు చేసి = తలఁచి, కుతుకము = కుతూహలము.
  6. మృగశాబంబు = జింకపిల్ల, పరిగ్రహంబుచేన్ = పోషణచేత ననుట, సితపక్షకళానిధి = శుక్లపక్షచంద్రుఁడు.
  7. పూరి = గడ్డి, బెబ్బులిపిండుదిగులునన్ = పెద్దపులులగుంపులవలని భయముచేత, మలయుచున్ = మసలుచు, కోమలశృంగయుగ్మంబుచేతన్ = లేతకొమ్ములజంటచేత, కండూతి = దురద, తీర్చున్ = పోగొట్టును, మవ్వంపు = మనోజ్ఞమైన, అనుదినంబు = ప్రతిదినమును.