పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొకపుణ్యాశ్రమభూమి చేరి యిహసౌఖ్యోపాయముల్ చింతసే
యక నారాయణుదివ్యమూర్తియెడ సోహంభావముం జేయుచున్.[1]

244


శా.

ఈరీతి౯ మునివృత్తి గైకొని త్రిలోకేశుం జగత్పావనా
కారున్ సాగరకన్యకాకుచతటీకస్తూరికాపంకవ
క్షోరమ్యుం బరమాత్మునిం గొలుచుచున్ శుద్ధాత్ముఁడై సాత్విక
ప్రారంభీకృతపుణ్యకీర్తుఁ డగుచున్ భాసిల్లె యోగీంద్రుఁడై.[2]

245


ఉ.

కేశవ పద్మనాభ హరి కృష్ణ జనార్దన వాసుదేవ య
జ్ఞేశ సరోరుహాక్ష పరమేశ్వర యచ్యుత దేవ శ్రీహృషీ
కేశ యటంచుఁ జిత్తమున నెప్పుడుఁ బల్కుచు నుండుఁ గాని భూ
మీశుఁడు తప్పియైన నితరేతరవాక్యము లాడఁ డెన్నఁడున్.[3]

246


క.

హరిసంకీర్తన సేయుచు, హరిభక్తులగోష్ఠిఁ జెంది హరిపదపూజా
పరికరములు తగఁ గూర్చుచు, హరిసేవ దొఱంగకుండె నతఁడు మునీంద్రా.[4]

247


ఆ.

కర్మహేతుకములు గానికర్మంబులు, నడపి పాశబంధనములు ద్రెంచి
సంగమంబు లుడిగి సకలజీవంబుల, యందు సమమనస్కుఁ డగుచు నుండె.[5]

248


వ.

అట్లుండి యమ్మహీపతి యొక్కనాఁడు మధ్యాహ్నసమయంబున నొక్కపర్వత
సమీపంబునఁ బ్రవహించునట్టి పుణ్యనదీజలంబులఁ దీర్థంబాడి తత్తీరంబునఁ
గాలోచితకర్మంబు లాచరించుచున్న సమయంబున.[6]

249


ఆ.

ఈననైన యొక్కయేణి నిరంతర, ప్రసవవేదనలఁ గరంబు నొచ్చి
యడవినుండి దప్పి నరుదెంచి నదిలోనఁ, దఱియఁ జొచ్చి నీరు ద్రావునపుడు.[7]

250


క.

కకుబంతఘూర్ణితోగ్ర, ప్రకటితలయకాలరుద్రపటునినదగతిన్

  1. అకలంకప్రమదంబుతోడన్ = కొఱఁతలేనిసంతోషముతో, కైవల్యసుఖంబున్ = పరమపదసౌఖ్యమును, ఇహసౌఖ్యోపాయంబులు = ఈలోకమునందు పొందఁదగిన సౌఖ్యములకు అనుకూలమైన మార్గములను, చింకసేయక = విచారించక - తలఁపక, సోహంభావమున్ = అదియే నేను అనుటను.
  2. త్రిలోకేశున్ = మూఁడులోకములకు నీశ్వరుఁ డైనవానిని, జగత్పావనాకారున్ = లోకమును బవిత్రమునుగాఁ జేయఁనట్టి ఆకృతిగలవానిని, సాగర... రమ్యున్ = లక్ష్మీదేవియొక్క వక్షస్స్థలమునందలి కస్తూరికలకముతోడిఱొమ్ముచేత మనోజ్ఞుఁ డైనవానిని, శుద్ధాత్ముఁడు = నిర్మలచిత్తము గలవాఁడు, సాత్త్విక...కర్ముఁడు = సత్వగుణప్రధానమైన ప్రవర్తనముచేత ప్రారంభించఁబడిన సుకృతకర్మలు కలవాఁడు, భాసిల్లెన్ = ప్రకాశించెను.
  3. ఇతరేతరవాక్యములు = అన్యోన్యములైన మాటలు (ఇచ్చట ఇతరసంబంధపుమాటలు అని అర్థమగుచున్నది.)
  4. గోష్ఠిన్ = సభయందు, పరికరములు = ఉపకరణములు (లేక) వస్తువులు, తొఱంగక = విడువక.
  5. కర్మహేతుకములు = వ్యాపారాంతరములకు కారణములు, పాశబంధనములు = (అపేక్షారూపకములైన) ద్రాళ్ళకట్టులు, త్రెంచి = తెగఁగొట్టి, సంగమంబులు = (ఇతరులతోడి) కూడికలు, జీవంబులయందున్ = ప్రాణులయందు, సమమనస్కుఁడు = సమబుద్ధిగలవాఁడు.
  6. తీర్థంబాడి = స్నానము చేసి, కాలోచిత = వేళకుఁ దగిన.
  7. ఈననైన = ఈనునట్టికాలము సమీపించిన, ఏణి = ఆఁడుజింక, నిరంతర = ఎడతెగని, నొచ్చి = నొప్పిని పొంది - బాధపడి, దప్పిన్ = దాహముచేత, తఱియన్ = చేర - నీళ్లున్నచోటును చేరననుట.