పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనినఁ బరాశరుం డిట్లనియె.

211


చ.

అమరులలోన నామిహిరుఁ డారయ నేమిగ నెక్కుడయ్యె నా
కమలహితుం డనంగ నధికారితనం బొనరించునంతమా
త్రమె యగు నమ్మహాతునిప్రతాపముఁ దేజము నెట్లు గల్గినన్
గమలభవాండమధ్యమునఁ గ్రమ్మినచీఁకటిఁ బాపనోపునే.[1]

212


క.

సప్తగణపరివృతుం డగు, సప్తాశ్వుఁడు నామధేయసాక్షి యగుచు సం
ప్రాప్తీకృతహరితేజో, దీప్తుండై వెలుఁగఁజేయు ధృతి లోకంబుల్.[2]

213


తే.

ఆదినారాయణాంశంబులై వెలుంగు, ఋగ్యజుస్సామవేదంబు లినునిమూర్తి
నుండి ప్రకటంబులై ప్రాతరాదులైన, మూఁడుకాలంబులును దేజమున ఘటించు.[3]

214


శా.

భూదేవోత్తమ భూరిపావకశిఖాపుంజంబున సంభవం
బై దీపం బొకయిక్క నుండి గృహమధ్యధ్వాంతమున్ బాసిన
ట్లాదామోదరుదీప్తిలో బహుసహస్రాంశంబు మార్తాండునం
దాదిం బెట్టి మహాతమం బడఁచు బ్రహ్మాండాంతరాళంబునన్.[4]

215


వ.

కావునఁ జైత్రాదు లైనద్వాదశమాసంబులఁ బ్రత్యేకంబ దేవర్షియక్షరాక్షసగం
ధర్వోరగాప్సరోగణంబులచేతఁ బరివృతుండై శీతోష్ణజలంబులు కిరణంబులుగా
విష్ణుతేజోవిరాజితుండై దేవపితృమనుష్యలోకంబులకు నాప్యాయనంబు సేయు
చుండును. అట్టిసూర్యకిరణములందు సుషన్ను యనుకళ సుధాకరమండలంబు
నకు నభివృద్ధిభూతయై యుండు.[5]

216


చ.

అమృతమయంబు లైనజలజాప్తమయూఖములం బ్రవృద్ధమై
యమరిన చంద్రమండలసుధామృతమున్ సురకోటి కృష్ణప
క్షమున భుజించి పెద్దయు వికాసము నొందు నతండు శుక్లప

  1. మిహిరుఁడు = సూర్యుఁడు, ప్రతాపము = వేండ్ద్రము, తేజము = తేజస్సును, కమల...మధ్యమునన్ = బ్రహ్మాండమునడుమ, క్రమ్మిన = క్రమ్ముకొనిన.
  2. సప్తాశ్వుఁడు =సూర్యుఁడు, సంప్రాప్తీ...దీప్తుఁడు = పొందఁబడినదిగాఁ జేయఁబడిన శ్రీహరియొక్క తేజస్సుచేత వెలుఁగునట్టివాఁడై.
  3. ఇనుని = సూర్యునియొక్క, ప్రకటంబులై = ప్రసిద్ధములై, ప్రాతరాదులు = ప్రాతఃకాలము మొదలైనవి, ఘటించున్ = కూర్చును.
  4. భూరి...పుంజంబునన్ = విస్తారమైన నిప్పుమంటలసమూహమునందు, సంభవంబై = పుట్టినవై, ఇక్కన్ = స్థానమునందు, ధ్వాంతమున్ = చీఁకటిని, దీప్తిలోన్ = ప్రకాశమునందు, మార్తాండునందున్ = సూర్యునియందు, మహాతమంబు = గొప్పచీఁటిని, అంతరాళంబునన్ = మధ్యప్రదేశమునందు.
  5. విష్ణుతేజోవిరాజితుండు = విష్ణుతేజస్సుచేత ప్రకాశించువాఁడు, ఆప్యాయనంబు = తనువును, సుధాకరమండలంబునకున్ = చంద్రబింబమనకు, అభివృద్ధిభూత = అభివృద్ధిని చేయునది.