పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యవిరళవృత్తి నొందునటులైననిమిత్తము విప్రకోటిచే
సవనము లెల్ల నెల్లెడల సాగు సుపర్వులు తృప్తిఁ బొందఁగన్.[1]

203


ఉ.

కావున నిజ్జగంబుల మఘంబులు వేదములున్ వసుంధరా
దేవముఖైకవర్ణములు దేవతలుం బశుపక్షియక్షవృ
క్షావలిమేర గాఁగ సచరాచరకోటులు వృష్టిచేతఁ గా
దే వహియింపఁ బెం పలరె వృష్టికి మూలము భానుఁ డెమ్మెయిన్.[2]

204


ఆ.

ఇనునితేరు నూటయెనుబదిమండల, గతుల నడుచు నుభయకాష్ఠలందు
నయనకాలవశత నారోహణావరో, హములవలన వత్సరముల నెపుడు.[3]

205


క.

నెలనెల నినునరదము తప, సులు యతులు నా దివౌకసులు భుజగులు దై
త్యులు నచ్చరలును గంధ, ర్వులు రక్షింపంగ భాస్కరుఁడు వెలుఁగొందున్.[4]

206


క.

హరిదివ్యశక్తిపెంపున, సరసీరుహబాంధవుండు సప్తగణములుం
బరివేష్టింపఁగఁ దేజో, త్కరుఁడై లోకముల యంధకారం బడఁచున్.[5]

207


సీ.

ఆదిత్యు లధిపతు లైయుందు రావాలఖిల్యాదిమౌనులు కీర్తనములు
సేయుదు రప్సరస్త్రీలు నాట్యము లాడుదురు పరివారమై బెరసి పనులు
గావింతురు సురలు ఘనభుజంగాధిపు లరదంబునకు మోకులై వహింతు
రరుదొప్ప గంధర్వవరులు పాడుదురు యతులు సమస్తంబు గైకొని భరించి


తే.

నడుపుచుండుదు రిబ్భంగి నలినహితుఁడు, శీతఘర్మాంబురోచులచేత విష్ణు
దివ్యశక్తిప్రభావసందీప్తుఁ డగుచు, నఖిలలోకంబులకు దానయై చెలంగు.[6]

208


వ.

అనిన మైత్రేయుం డిట్లనియె.

209


ఉ.

భానునితేరు నీ విపుడు పల్కినసప్తగణంబులన్ సమా
ధానములన్ భరింప నతితాపహిమాంబుచయంబు దీప్తుఁడై
పూని వెలుంగునంచు మునిపుంగవ నీ విపు డానతిచ్చిన
ట్లైనఁ బయోజబాంధవుమహత్వము లేదని చెప్పవచ్చునే.[7]

210
  1. ఫలపాకసాధకములు = ఫలసిద్ధిని చేయునవి, భువనములన్ = లోకములయందు, ప్రజా...హేతుకంబులు = ప్రజలయొక్క పుట్టుకకును బ్రతుకునకును కారణములైన క్రియలకు నిమిత్తములు, అవిరళవృత్తిన్ = స్థిరమైన వర్తనమును, సవనములు = యజ్ఞములు, ఎల్లెడలన్ = సర్వప్రదేశములయందును.
  2. మఘంబులు = యజ్ఞములు, వసుంధరా...వర్ణములు = బ్రాహ్మణాదిముఖ్యవర్ణములు, మేరగాన్ = ఎల్లగా - తుదగా, మూలము = అధికారణము.
  3. ఉభయకాష్ఠలందున్ = దక్షిణోత్తరదిక్కులు రెంటియందును, ఆరోహణావరోహములవలనన్ = ఎక్కుట దిగుటవలన.
  4. దివౌకసులు = దేవతలు.
  5. సరసీరుహబాంధవుండు = సూర్యుఁడు, సప్తగణములున్ = తపసులు మొదలయిన యేడ్గురిసమూహములును, పరివేష్టింపఁగన్ = చుట్టుకొనఁగా, తేజోత్కరము = వెలుఁగు గుమి, ఆంధకారము = చీఁకటిని.
  6. బెరసి = చుట్టుకొని, భుజంగాధిపులు = సర్పరాజలు, అరదంబునకు = రథమునకు, నలినహితుఁడు = సూర్యుఁడు, శీతఘర్మాంబురోచులచేతన్ = చల్లవేడినీళ్లరూపమైన కిరణములచేత, సందీప్తుఁడు = లెస్సగా ప్రకాశించువాఁడు.
  7. అతితాపహిమాంబుచయంబు =- మిక్కిలియుష్ణమును శీతలమునైన నీటినమూహమును, దీప్తుఁడు = వెలుఁగునట్టివాఁడు, పయోజ...మహత్వము = సూర్యునిమహిమము.