పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అతులాకాశము సర్వమున్ దనమయంబై కాలచక్రంబుతో
సతతంబున్ హరి నాత్మలో నిడి యథేచ్ఛగా శింశుమారప్రజా
పతి త్రైలోక్యసమున్నతిన్ మకరరూపవ్యక్తిమై యుండు వి
స్తృతుఁడై మీఁద ధ్రువుండు దావెలుఁగుఁ దత్పుచ్ఛాగ్రదేశంబునన్.[1]

193


తే.

సతతమును శింశుమారాఖ్యచక్ర మెపుడు, చంద్రసూర్యగ్రహాదినక్షత్రసమితిఁ
ద్రిప్పుచును దాను నొక్కటఁ దిరుగుచుండు, నన్నిటికి మీఁద ధ్రువుఁడును నట్ల తిరుగు.[2]

194


వ.

సూర్యచంద్రగ్రహనక్షత్రతారకాగణంబులు వాయునాళంబులచేత ధ్రువుని
యందు దృఢబంధంబులై యుండును.[3]

195


క.

మును శింశుమారుఁ డబ్జా, క్షునకుఁ దపం బాచరించి జ్యోతిశ్చక్రం
బున నిల్చె ధ్రువుఁడు నవ్విధ, మునఁ గొల్చి తదీయపుచ్ఛమున విలసిల్లైన్.[4]

196


వ.

 కావున సర్వాధ్యక్షుం డైనపుండరీకాక్షుండు శింశుమారచక్రంబునకు నాధా
రంబు శింశుమారుండు ధ్రువునకు నాధారంబు ధ్రువుఁడు సూర్యునకు నాధా
రంబు సూర్యుండు సదైవాసురమానుషం బైనలోకంబునకు నాధారంబై సమస్త
భూతంబుల నన్నపానాదులఁ బరితృప్తులం జేయు నెట్లనిన.[5]

197


చ.

ఎనిమిదిమాసముల్ రవి మహీవలయంబునఁ గల్గుతోయముల్
దనకిరణంబులందుఁ గొని తక్కినమాసచతుష్టయంబునన్
ఘనతరవృష్టిరూపములుగా జలముల్ గురియింప లోకమె
ల్లను బరితృప్తిఁ బొందును జలంబును నన్నముఁ గల్గి పెంపుతోన్.[6]

198


సీ.

కాలాత్ముఁ డైన భాస్కరదేవుఁ డాత్మీయచండాంశువులచేత జగతియందుఁ

  1. తనమయంబు = తనయొక్కస్వరూపమునే అంతటఁ గనఁబఱచునది, యథేచ్ఛన్ = ఇచ్ఛ వచ్చినట్టు, త్రైలోక్యనమున్నతిన్ = మూఁడులోకములకు మీఁది పొడువున, మకరరూపవ్యక్తిమై = మొసలిరూపముయొక్క తెలివిడితో - మొదలిరూపుతో, విస్తృతుఁడు = గొప్ప ఆకృతి గలవాఁడు, తత్పుచ్ఛాగ్రదేశంబునన్ = ఆశింశుమారప్రజాపతియొక్క తోఁక కొనయైనచోట.
  2. శింశుమారాఖ్యచక్రము = శింశుమారము అను పేరుగల చక్రము, సమితిన్ = సమూహమును, ఒక్కటన్ = ఒక్కసారిగా.
  3. వాయునాళంబులచే = గాలిక్రోవులచేత, దృఢబంధంబు = గట్టికట్టు గలది.
  4. అబ్జాక్షునకున్ = విష్ణువును గూర్చి, జ్యోతిశ్చక్రంబునన్ = నక్షత్రమండలమునందు.
  5. సర్వాధ్యక్షుండు = అన్నిటికి నధిపతి, సదైవాసురమానుషము = దేవతలతోడను అసురులతోడను మనుష్యులతోడను గూడినది, భూతంబులన్ = ప్రాణులను.
  6. రవి = సూర్యుఁడు, మహీవలయంబున = భూమండలమునందు, తోయములు = నీళ్లను, వృష్టి = వాన, పరితృప్తిన్ = తనివిని, పెంపుతోన్ = అభివృద్ధితో.