పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంద సకలలోకానంద యగుచు దివ్యశతవత్సరంబులు త్రిపురమర్దను కపర్దంబున
భరియింపంబడి తపోమహిత్యసాధితమనోరథుం డైరభగీరథునిప్రయత్నంబునం
జేసి మహీమండలంబుల కవతరించి కపిలవిపులకోపాటోపవహ్నిజ్వాలామాలికా
దగ్ధగాత్రు లైనసగరపుత్రులఁ బరమపవిత్రులఁ జేసి దక్షిణసముద్రంబునం గలసె
నట్టి భాగీరథీతీరంబున.[1]

187


ఉత్సాహ.

దేవదేవుఁ డైనవాసుదేవుఁ డెల్లనాడుఁ ద
త్పావనైకతీరములఁ దపంబు లర్థిఁ జేయుభూ
దేవకోటికెల్ల ముక్తితెరువు చూపుచున్ రమా
దేవితోడఁ గూడియుండు దేవకోటి గొల్వఁగాన్.[2]

188


ఉ.

గంగనుఁ బోయి యం దుచితకర్మగతిన్ మనుజుండు పుణ్యరూ
పాంగము లైనకాలములయందుఁ దిలోదకపిండదానముల్
సంగతభక్తితోడ నొకసారి యొనర్చినఁ దత్కులంబు ని
ర్భంగపవిత్రతామహిమ పాటిలనుండు ననేకకాలముల్.[3]

189


క.

శాంతిగ ద్వీపాంతరదే, శాంతరముల నుండియైన యాగంగ మదిన్
జింతించిన జన్మత్రయ, సంతాపము లెల్లఁ బాసి చను మనుజులకున్.[4]

190


క.

గంగానది గంగానది, గంగానది యనుచు రేపకడ మేల్కనుచున్
గంగానదిఁ బ్రణుతించిన, మాంగల్యసుఖంబు లెల్ల మనుజుల కొదవున్.[5]

191


వ.

ఇట్లు త్రైలోక్యపావని యైనగంగానదికి జన్మస్థానం బైన విష్ణుపదంబున.[6]

192
  1. విష్ణు...నిష్ఠ్యూత = విష్ణుదేవుని కాలిబొటనవ్రేలిచే ఉమియఁబడినది - విష్ణుపాదమునందు పుట్టినది, త్రిలోకా...భూత = మూఁడులోకములకు నాధారమైనది, దేవాంగనా...కారణ = దేవతాస్త్రీలను విహరించుటకొఱకు పిలుచునది - దేవతాస్త్రీలకు క్రీడాస్థానము అనుట, నిర్భంగ...జాల = భంగము పొందని (అణఁపఁబడిన) అలలనెడి యుయ్యాలలయందు ఊగుతున్న హంసలగుంపులుగలది, సర్వజ్ఞుండు = అంతయుఁ దెలిసినవాఁడు, వ్యోమ...మందిర ఆకాశమే శిఖగాఁగలవాఁడైన శివునియొక్క జడముడి యను కిరీటమునకు అలంకారమైనది, సంతత...పరాయణులు = ఎల్లప్పుడు ప్రాణాయామమునందు ఆసక్తులైనవారు, పరిపూతము = పరిశుద్ధము, ఆలోకించుచున్ = చూచుచు - సమీపించి యనుట, అష్టాశీతి...విస్తీర్ణంబు = ఎనుబదియెనిమిదివేల ఆమడల విరివిగల, శశాంకమండలంబు = చంద్రమండలము, అప్లావనంబు = అంతట తడిసినదానిఁగా, తదీయ...తోడన్ = ఆచంద్రునివైన కిరణములనుండి కాఱుచున్న అమృతధారాప్రవాహముయొక్క తెల్లఁదనముచేత తళతళయనెడు కాంతులతో, కనకాచలంబుమీఁదన్ = మేరుపర్వతముమీఁద, సీతా...ధానంబులన్ = సీత అలకనంద చక్షువు భద్ర అను పేళ్లచే, వాహినీచతుష్టయంబు = నాలుగునదులు, పరమపావనంబున్ = మిక్కిలి పవిత్రమునుగా, సకలలోకానంద = ఎల్లలోకములను సంతోషింపఁజేయునది, దివ్య... వత్సరంబులు = నూఱుదేవతాసంవత్సరములు, త్రిపురమర్దను కపర్దంబునన్ = శివునియొక్క జడముడియందు, తపో... మనోరథుఁడు = తపస్సుయొక్క మహిమచేత సాధింపఁబడినకోరిక కలవాఁడు - అధికతపస్సు చేసి కోరికను నెఱవేర్చుకొన్నవాఁడు, అవతరించి = దిగి, కపిల...గాత్రులు = కపిలమహామునియొక్క మిక్కుటమైన కోపముయొక్క విజృంభణముచేత కలిగిన నిప్పుమంటలవరుసలచేత కాలినదేహములు గలవారు, పరమపవిత్రులన్ = మిక్కిలి పరిశుద్దులనుగా.
  2. ఎల్లనాడు = ఎల్లప్పుడు, తత్పావనైకతీరముల = దానిదైన కేవలము పరిశుద్ధము లైన దరులయందు, అర్థిన్ = అనురక్తితో, భూదేవకోటికిన్ = బ్రాహ్మణసమూహమునకు, ముక్తితెరువు = మోక్షమార్గమును, రమాదేవితోడన్ = లక్ష్మీదేవితో, కొల్వఁగాన్ = సేవించఁగా.
  3. ఉచితకర్మగతిన్ = తగినకర్మలను నడపునట్టి విధముతో, పుణ్యరూపాంగములు = పుణ్యమును నిరూపించునట్టి స్వరూపము గలవి, తిలోదకపిండదానములు = నువ్వులు నీళ్లు విడుచుటయు పిండములు పెట్టుటయను, సంగత = పొందిన, నిర్భంగ...మహిమ = కొఱఁతలేని పరిశుద్ధత్వముయొక్క మేలిమి, పాటిలన్ = కలుగఁగా.
  4. శాంతిగన్ = ఓర్పుతో, చింతించిన = ధ్యానించినను, జన్మత్రయసంతాపములు = మూఁడుజన్మములయందలి దుఃఖములు, పాసిచనున్ = తొలఁగిపోవును.
  5. రేపకడన్ = ప్రాతఃకాలమున, ప్రణుతించినన్ = స్తోత్రము చేసినయెడ, మాంగల్యసుఖంబులు = శుభమును సౌఖ్యమును, ఒదవున్ = కలుగును.
  6. త్రైలోక్యపావని = మూఁడులోకములను పరిశుద్ధములనుగాఁ జేయునది.