పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పూని కులాలచక్రమునుబోలె రయంబునఁ గాలచక్ర ము
గ్రానిలవేగమై తిరుగు నానడుమం గడుమందయానుఁడై
భానుఁడు సంచరించుచు నభస్స్థలినెల్ల వెలుంగఁజేసి తే
జోనిధియై సుమేరుగిరిచుట్టుఁ బ్రదక్షిణ మాచరింపఁగన్.[1]

172


ఆ.

తీవ్రవృత్తితోడఁ దిరుగుకులాలచ, క్రంబునడిమ మంటిగతి ధ్రువుండు
మందగతిఁ జరించు మహనీయతరకాల, చక్రమధ్యమునను సంతతంబు.[2]

173


వ.

ఇవ్విధంబునఁ గాలాత్ముం డైనద్వాదశాత్మునిదర్శనాదర్శనంబు లైనదివారాత్రం
బులు వ్యుష్టియు నుషయు నగుఁ దదీయమధ్యంబులు సంధ్యాకాలంబు లయ్యె నందు.[3]

174


క.

భానునితేజంబు బృహ, ద్భానుఁడు గొను రాత్రులందుఁ బావకు తేజం
బానలినాప్తుఁడు గైకొను, మానుగ దివసంబులందు మర్యాదలతోన్.[4]

175


ఆ.

కానఁ బద్మహితుఁడు ఘస్రకాలంబున, దీప్తిమంతుఁ డగుచుఁ దేజరిల్లు
రాత్రులందు వీతిహోత్రుఁడు తేజంబు, గలిగి దూరమునకుఁ గానవచ్చు.[5]

176


వ.

ఉభయసంధ్యాకాలంబుల సూర్యాగ్నితేజంబులు జలంబులం బ్రవేశించి తదీయ
చ్ఛాయలు గగనతలంబునఁ బ్రతిబింబితంబు లగుటం జేసి ప్రభాతసాయంకాలంబు
లరుణారాగంబు లయ్యె నట్టిసంధ్యాకాలంబుల.[6]

177


క.

బాహుపరాక్రము లక్షయ, దేహులు మందేహనామధేయనిశాట
వ్యూహములు పెక్కుగో ట్లు, త్సాహంబునఁ దొల్లి బ్రహ్మశాపమువలనన్.[7]

178


వ.

సూర్యమండలంబు భక్షింప సమకట్టి పొదువు నప్పుడు.[8]

179


సీ.

భూసురోత్తములు సంధ్యాసమయంబుల వైదికప్రణవపూర్వముగ వేద

  1. కులాలచక్రము = కుమ్మరిసారె, ఉగ్రానిలవేగము = భయంకరమైన గాలియొక్క వేగముగలది, కడుమందయానుఁడు = మిక్కిలి తిన్నని నడకగలవాఁడు, సుమేరుగిరి = మేరుపర్వతము.
  2. తీవ్రవృత్తితోడన్ =- అధికవేగము గలవర్తనముతో, సంతతంబు = ఎల్లప్పుడు.
  3. కాలాత్ముండు = కాలస్వరూపుఁడు, ద్వాదశాత్ముని దర్శనాదర్శనంబులు = సూర్యునియొక్క చూచుటయుఁ జూడమియుఁ గలవి - సూర్యుఁడు కనఁబడుటయు కనఃబడమియుఁ గలవి, దివారాత్రంబులు = పగలు రేయును, తదీయ = ఆదివారాత్రములదైన.
  4. బృహద్భానుఁడు = అగ్ని, పావకు = ఆగ్నియొక్క, నలినాప్తుఁడు = సూర్యుఁడు.
  5. ఘస్రకాలంబునన్ = పగటి కాలమందు, దీప్తిమంతుఁడు = ప్రకాశము గలవాఁడు, వీతిహోత్రుఁడు = అగ్ని.
  6. ఉభయసంధ్యాకాలంబులన్ =ప్రాతస్సంధ్యాకాలమునందును సాయంసంధ్యాకాలమునందును, తదీయచ్ఛాయలు = ఆతేజస్సులవైనఛాయలు, గగనతలంబునన్ = ఆకాశప్రదేశమునందు, ప్రతిబింబితంబు = ప్రతిబింబించినది, ప్రభాతసాయంకాలంబులు = ప్రాతఃకాలసాయంకాలములు, ఆరుణరాగంబులు = ఎఱ్ఱనికాంతి గలవి.
  7. అక్షయదేహులు = క్షయింపని దేహములు గలవారు, నిశాటవ్యూహములు = రాక్షసులమూఁకలు.
  8. సమగట్టి = యత్నించి, పొదువునప్పుడు = ఆక్రమించునప్పుడు.