పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బెరయు మూడవయిరుసు దా నిరువదేను, వేలయోజనములతోడ వెలసియుండు.[1]

159


తే.

వర్షశీతోష్ణజాలముల్ వరుసతోడ, దత్తదక్షత్రయంబు తన్నాభులందుఁ
దగిలి కాలక్రమంబులు దప్పకుండఁ, దిరుగుచక్రంబు వక్రమై దిశలయందు.[2]

160


వ.

మఱియు నేఁబదివేలయోజనంబు లైనబండి కాఁడికి వలపలయును యిరుసువలప
లయును ధ్రువునిదృఢబంధంబు లైయుండు. యుగంబుడాపల గాయత్రియు
బృహతియు నుష్ణిక్కును జగతియు ద్రిష్టుప్పును అనుష్టుప్పును బఙ్క్తియు నను
ఛందంబు లేడును రథతురంగంబు లైయుండు నట్టిరథచక్రంబు మానసోత్తర
శైలంబుమీఁదం దిరుగుచుండు నమ్మహానగంబునందు.

161


సీ.

ప్రథమదిక్కున నుండు పర్జన్యపాలిత ప్రకటవస్వౌకసారాపురంబు
దక్షిణంబున నుండు దండధరాధీన నిరుపాధి సంయమనీపురంబు
పశ్చిమంబున నుండుఁ బాశపాణిసురక్షితప్రసిద్ధము సుఖోదయపురంబు
ఉత్తరంబున నుండు నొగి సోమపాలిత శ్రీకరంబు విభావరీపురంబు


తే.

ఇట్టిపురములు నాల్గు ననేకయోజ, నముల విస్తీర్ణములు గల్గి యమలమహిమఁ
దనరుఁ బుష్కరద్వీపమధ్యంబునందు, మానసోత్తరనగబాహ్యమండలములు.[3]

162


క.

ఈనగరంబులు నాల్గిట, భానుఁడు చరియించుచుండుఁ బ్రభ లేపారన్
గాన నుదయాస్తమానము, లై నరులకుఁ దోఁచు జగము లన్నిటియందున్.[4]

163


శా.

జ్యోతిశ్చక్రసమేతుఁడై మెఱసి సూర్యుం డిట్లు త్రింశన్ముహూ
ర్తాతీతం బగునట్టి కాలమున నిర్యాణంబు గావించుఖ
ద్యోతుం డెక్కడఁ దోఁచు నక్కడ దినం బుగ్రాంశుదీప్తిచ్ఛటా
వీతస్థానములెల్ల రాత్రు లగు నుర్వీభాగ మాద్యంతమున్.[5]

164


వ.

ఇట్లు ముప్పదిముహూర్తంబుల సూర్యుం డింద్రయమవరుణసోమపట్టణంబులకుం
గ్రమంబునఁ బ్రభాతమధ్యాహ్నసాయంకాలమధ్యరాత్రంబులఁ గావించు
చుండు.

165


క.

తోయజహితుఁ డెవ్వారికి, నేయెడఁ గాన్పించె నది మునీంద్రా పూర్వం

  1. బెరయున్ = ఉండును.
  2. యుగంబు = కాఁడి అమ్మహానగంబునందు = ఆగొప్పకొండయందు.
  3. పర్జన్యపాలిత = ఇంద్రునిచేత పాలింపఁబడుచున్న, వస్వౌకసారాపురంబు = దేవతల పట్టణము, దండధరాధీన నిరుపాధి = యమునియధీనమైన యుపాధి లేనిదైన, పాశపాణి = వరుణునిచేత, సోమపాలిత శ్రీకరంబుగన్ = శివునిచే పాలింపఁబడి సంపద కలుగఁజేయునదిగా, బాహ్యమండలములు = బయటిప్రదేశములు గలవి.
  4. ప్రభలు = కాంతులు, ఏపారన్ = అతిశయింపఁగా.
  5. త్రింశన్ముహూర్తాతీతంబు = ముప్పదిముహూర్తములచేతఁ గడచినది, నిర్యాణంబు గావించున్ = అస్తమించును, ఖద్యోతుండు = సూర్యుఁడు, ఉగ్రాంశుదీప్తిచ్ఛటావీతస్థానములు = సూర్యుని కిరణసమూహములచేత పోఁగొట్టఁబడిన చోటులు - సూర్యప్రకాశము లేని తావులు.