పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పద నేపారుసుమంబులన్ ఫలములన్ భాసిల్లువృక్షంబునం
దుదయంబంది మహిం దరు ల్వనములై యొప్పారుచందంబునన్.[1]

152


సీ.

అరుదైన విష్ణుమాయాశక్తివలననుఁ బ్రకృతిపూరుషుఁడు సంభవమునొందుఁ
దత్పురుషునకుఁ బ్రధానభూతము పుట్టు నతనికి మహదాదు లవతరించు
నందు నాకాశంబు నాకాశతత్వంబువలన గాలియు గాలివలన వహ్ని
యును వహ్నివలన నయ్యుదకము నుదకంబువలన భూమియు భూమివలనఁ బుట్టు


తే.

దేవదైతేయపితృవరాదికము లైన, సృష్టియందుఁ జరాచరశ్రేణి యెల్లఁ
బుత్రపౌత్రాంతరముల నుద్భూత మొందు, నిట్లు కడలేక బ్రహ్మాండకోట్లు మెఱయ.[2]

153


ఆ.

వ్రీహిబీజ మంకురించుచు మూలంబు, గలిగి నాళపత్రకాండకోశ
పుష్పతండులములఁ బొదలి యంతంబునఁ, జెడుచు బీజవృద్ధి చేసినట్లు.[3]

154


ఉ.

పంబినవిష్ణుశక్తి నొకపద్మభవాండము పుట్టు నమ్మహాం
డంబు విశాలమై చనునెడన్ శతకోటిసహస్రధావిలా
సంబులఁ బొందఁజేయునది సర్వము నట్ల బహుప్రకారరూ
పంబుల నుల్లసిల్లు నిరపాయతఁ గాలవశంబు పెంపునన్.[4]

155


క.

అని బ్రహ్మాండమహత్త్వము, వినిపించి పరాశరుండు వెండియు నతనిం
గనుఁగొని జ్యోతిశ్చక్రము, నినునిం జెప్పంగఁగోరి యిట్లని పలికెన్.

156


ఆ.

నవసహస్రయోజనముల సూర్యునిరథం, బీష యొప్పుదాని నినుమడించి
యెనయ నూటయేఁబదేనులక్షలయోజ, నములు మొదలియక్ష మమలచరిత.[5]

157


ఆ.

అంచు లైదు నెమ్ము లాఱు నాభులు మూఁడు, గలిగి సూక్ష్మగమనకలిత మగుచు
సంయమీంద్ర వినుము సంవత్సరాకృతిఁ, గాలచక్రమందుఁ గ్రాలుచుండు.[6]

158


తే.

దాని రెండవయక్షంబు మౌనిచంద్ర, వినుము నలువదివేలయోజనము లగుచు

  1. మోసు = మొలక, మూలంబుతోన్ = వేరుతో, స్కంధము = ప్రకాండము - ప్రకాండము - బోదె, పత్రసంపదన్ = ఆకులకలిమిచేత, ఏపారుసుమంబులన్ = అతిశయించునట్టి పువ్వులచేతను, ఉదయంబంది = పుట్టి, తరులు = వృక్షములు.
  2. అరుదు = ఆశ్చర్యము - వింత, సంభవము నొందున్ = పుట్టును, ఉద్భూత మొందున్ = పుట్టును.
  3. వ్రీహిబీజము = వరివిత్తనము, అంకురించుచున్ = మొలచుచు, నాళ... తండులములన్ = కాఁడ ఆకు పొట్ట యెన్ను బియ్యము వీనిచేత, పొదలి = అభివృద్ధినొంది, అంతంబున = కడపట.
  4. పంబిన = సర్వవ్యాపకమైన, పద్మభవాండము = బ్రహ్మాండము (అండము = గుడ్డు), సహస్రధా = వేయివిధములైన, నిరపాయత = అపాయములేమిచేత.
  5. ఈష = నొగ, ఇనుమడించి = ఇబ్బడించి, ఎనయన్ = కలయ, అక్షము = ఇరుసు (దీనికి బండిచక్రమని అమరమునందు అర్థము వ్రాయఁబడియున్నది. సందర్భమును బట్టి యిక్కడ యీయర్థ మగుచున్నది.)
  6. నెమ్ములు =కడకమ్ములు, నాభులు = తూములు, సూక్ష్మగమనకలితము = సూక్ష్మమైన నడకతో డస్సినది, క్రాలుచు = వర్తించుచు.