పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వేడుకతోడం గూఁతును, గోడలిఁ గామించువారు గురుజనములకుం
గీడొనరించినవారును, గూడి మహాజ్వాలయందుఁ గూలుదురు సుమీ.

116


ఆ.

వేదవిక్రయులును వేదదూషకులు న, గమ్యగాము లైనకష్టమతులు
పోయి లవణనరకమునఁ గూలియుండుదు, రధికపాపకర్ములై మునీంద్ర.[1]

117


తే.

దేవతారత్నగురుజనద్విజసమాజ, దూషకులును మర్యాదలఁ ద్రోచి నడచు
వారు పరధన మాశించుచోరకులు వి,లోహనరకాంతకమునఁ గూలుదురు సూవె.

118


క.

దేవాతిథిఋషిపితృపూ, జావిరహితు లైనదుష్టజనములు క్రిమిభ
క్ష్యావేశమతులుఁ గూలుడు, రావల గతిలేక క్రిమిశ మనునరకమునన్.[2]

119


క.

సంతతముఁ జక్రసాయక, కుంతాసులు సేయు కారుకులు గూలుదు ర
త్యంతభయదవిశసననర, కాంతరమున వెడలలేక యయుతాబ్దంబుల్.[3]

120


సీ.

అపవిత్రదానంబు లందినవాఁడు నయాజ్యయాజకుఁడు మృష్టాన్న మొరుల
కిడక తా నొంటిమైఁ గుడిచినవాఁడు నక్షత్రసూచకుఁడు దుర్జనరతుండు
లవణంబు పాలు బెల్లము నెయ్యి మాంసంబు తిలలు తైలము చల్ల తేనె పెరుగు
విక్రయించినయట్టివిప్రుండు మార్జాలకుక్కుటచ్ఛాగావికులవరాహ


ఆ.

సారమేయపక్షిజాలంబుఁ బెంచిన, వాఁడు కరుణలేనివాఁడు విప్ర
వరుఁ డధోముఖాఖ్యనరకంబులోపల, నుండు ఘోరమైనయునికితోడ.[4]

121


సీ.

కైవర్తకుఁడును రంగముఁ జెప్పువాఁడును విషము పెట్టినవాఁడు వెలఁదివలన
బ్రతికెడువాఁడును బర్వకారియుఁ బాపసూచకుండును గ్రామయాజకుండు
నిల్లు గాల్చినవాఁడు హితునిఁ జంపినవాఁడు శకునజ్ఞుఁడును గ్రతుసమయములను
సోమ మమ్మినమహీసురుడు దారుణరుధిరాంభంబులోపల నవధిలేక


తే.

చెందుదురు తేనెపెరలు రేఁచినయతండు, తొంటిమర్యాద లుడిపినదోషయుతుఁడు
గ్రామమునఁ గీడొనర్చినపామరుండు, వైతరణిఁ గూలుదురు బహువత్సరములు.[5]

122


క.

ఆచార్యనిందకులు వం, శాచారం బుడిగినట్టియధమాధములున్
ఏచి కుహకములు పన్నెడు, నీచులుఁ గూలుదురు కృష్ణనిరయములోనన్.[6]

123


క.

నిరతము వనిలోఁ బఱచిన, నరుఁ డాయసిపత్రవనమునం బడియుండున్

  1. అగమ్యగాములు = పొందరానివాని పొందినవారు.
  2. క్రిమిభక్ష్యావేశమతులు = పురుగులను భక్షించుటయందు మిక్కిలి పూనికగలబుద్ధిగలవారు.
  3. కారుకులు = శిల్పులు, అయుతాబ్దంబులు = వేయేండ్లు.
  4. అవి = గొఱ్ఱె, సారమేయ = కుక్క, జాలంబున్ = సమూహమును.
  5. కైవర్తుఁడు = చేపలఁ బట్టి జీవించువాఁడు, రంగము = నాట్యము, పర్వకారి = ధనాదిలోభముచేత అపర్వమందు పర్వక్రియాప్రవర్తకుఁడు, సూచకుఁడు = కొండెము చెప్పువాఁడు, గ్రామయాజకుఁడు = ఊరిపురోహితుఁడు.
  6. కుహకములు = కపటములు.