పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భ్యంచితవాయువుల్ పరిమళాస్పదఖేలనవృత్తిఁ బోలు వా
సించు సమస్తదిక్కుల నశేషము లైనరసాతలంబులన్.[1]

107


క.

దుర్గుణవిరహితుఁ డగునా, గర్గుం డవ్విభుని గురువుగాఁ గొల్చి మహా
నర్గళము లైన జ్యోతి, ర్మార్గంబులు శకునశాస్త్రమహిమలు నేర్చెన్.[2]

108


ఆ.

అట్టిశేషవాస మైనపాతాళంబు, క్రింద పుణ్యఫలనికృష్టములయి
యమునివిషయభూములై ఘోరనరకంబు, లస్త్రవహ్నియుతము లై తనర్చు.[3]

109


వ.

అట్టినరకలోకంబుల ననేకనరకభేదంబులు గల వెట్లనిన రౌరవంబును సూకరం
బును రోదనంబును తాలంబును విశసనంబును మహాజ్వాలంబును తప్తకుంభం
బును లవణంబును విలోహితంబును రుధిరాంభంబును నంధకారంబును వైతర
ణియు క్రిమిశంబును క్రిమిభోజనంబును అసిపత్రవనంబును కృష్ణంబును లాలా
భక్షణంబును దారుణంబుసు పూయవహంబును వహ్నిజ్వాలంబును అధశ్శిరం
బును సందంశంబును కృష్ణసూత్రంబును మహాతమంబును వీచీతమంబును అవీ
చియు శ్వభోజనంబులు మొదలైననరకంబు లనేకశతసహస్రంబులు కృతాంత
కింకరభయంకరంబులును పాపకర్మోపలక్షణనివాసంబులు నైయుండు నందు.

110


ఆ.

వినుము పక్షపాతమునఁ గూటసాక్షులఁ, గూడి బుధుల కియ్యకోలుగాని
తగవు చెప్పి సూనృతము దప్పి వర్తించు, వాఁడు గూలు రౌరవంబునందు.[4]

111


ఆ.

కుతికఁ బిసికి చంపి గురువుప్రాణము గొని, యావు నఱకి భ్రూణహత్య చేసి
నట్టినరులు రోధ మనునరకంబునఁ, బడుడు రవధిలేనిపాపములను.[5]

112


తే.

మద్యపానంబు చేసినమానవుండు, పసిఁడి దొంగిలువాఁడును బ్రహ్మహత్య
చేసినయతండు వీరితోఁ జెల్మికాఁడు, సూకరం బనునరకంబు సొత్తు రనఘ.

113


క.

గురుతల్పగతులు ధరణీ, వరవైశ్యులఁ జంపువారు వసుధేశధనా
హరులును సోదరిఁ బొందిన, నరులును బో తప్తకుంభనరకనివాసుల్.[6]

114


తరలము.

హితము భక్తియుఁ గల్గుమిత్రుల కెగ్గు చేసినవారలున్
సతుల నమ్మినవారలుం జెఱసాలఁ గాచినవారు దు
ర్వ్రతపరాయణు లైనవారును వాజిపణ్యులుఁ జువ్వె సం
తతము భీకరతప్తలోహమునం జరింతురు దీనులై.[7]

115
  1. చంచల...నేత్రలు = చలించుచున్న మనోజ్ఞములైన కనులు గలవారు, అలందుచున్ = పూయుచు, తన్ముఖా...వాయువులు = ఆచందనముగుండ వీచునట్టి మనోజ్ఞములైనవాయువులు, పరిమ...వృత్తిన్ = మంచివాసనకు స్థానభూతమైన విలాసముతోడి వ్యాపారముతో, వాసించున్ = వాసన గొట్టును, అశేషములు = సమస్తములు.
  2. మహానర్గళములు = గొప్పవియును ధారాళములును.
  3. కృతాంతకింకరభయంకరంబులు = యమకింకరులచేత భయమును కలుగఁజేయునవి, పాప...నివాసంబులు = పాపకర్ములకు అనుగుణములైన యునికిపట్టు.
  4. కూటసాక్షులన్ = తప్పుసాక్షులను, ఇయ్యకోలు = సమ్మతి, తగవు = న్యాయము, సూనృతము = సత్యము.
  5. కుతిక = గొంతు, భ్రూణహత్య = కడుపులోని శిశువును చంపుట, అవధి = మేర.
  6. గురుతల్పగతులు = గురుభార్యను పొందినవారు.
  7. ఎగ్గు = కీడు, కాచినవారు = కావలియున్నవారు, దుర్వ్రతపరాయణులు = చెడువ్రతములయందు ఆసక్తులు, వాజిపణ్యులు = గుఱ్ఱముల బేరము చేయువారు.