పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యాదు, లతిమనోహరంబు లైనయట్లు
కలవు గంధసారకర్పూరకస్తూరి, కాదులందుఁ గొఱఁత లరయ లేవు.[1]

94


క.

వేడుకతో మేళంబులు, గూడి భుజంగేశకుందకోరకరచనల్
ప్రోడలు సంగీతంబులు, పాడుదురు మృదంగవేణుపరివాదినులన్.[2]

95


క.

ఆసర్పాలయముల గడు, భాసిలు జలజాతకుసుమబంధుకసురభి
వ్యాసక్తమత్తభృంగవి, కాసవిలాపంబు లైనకాసారంబుల్.[3]

96


క.

ఆరయ ననేకములు గల, వారూఢప్రసవఫలసమగ్రము లగుచున్
భూరిభుజంగమవరక, న్యారామములై తనర్చు నారామంబుల్.[4]

97


క.

ఈ తెఱఁగునఁ బెంపారెడు, పాతాళంబుల కధోవిభాగంబున వి
ఖ్యాతుఁ డనంతుఁ డనంతవి, భూతిన్ విలసిల్లు నపరపురుషోత్తముఁడై.

98


ఉ.

నెట్టన దైత్యదానవమునిప్రవరామరసిద్ధసాధ్యు ల
ప్పట్టున నిల్చి నిత్యము నుపాస్తులు సేయఁగ నుండు నవ్విభుం
డట్టియనంతదేవుని మహామహిమల్ గొనియాడ శక్యమే
యెట్టిమహానుభావులకు నేమని చెప్పఁగవచ్చు నాతనిన్.[5]

99


సీ.

చారుసహస్రమస్తకవిభూషణమణిచ్ఛాయలు దిక్కుల సందడింప
దివ్యహాలామదోద్వేలఘూర్ణితనేత్రతారకాచయము నృత్యములు సలుప
నానాకిరీటవిన్యస్తప్రసూనసౌరభము లొండొంటితో రాయడింప
శరదభ్రశుభ్రనిశ్చలదేహవిస్ఫురద్ధాళధళ్యములు బిత్తరము లాడ


తే.

నిబిడకిటితటఘటితవినీలికాంశు, కముల దిక్కులఁ జిమ్మచీఁకట్లు గ్రమ్మ

  1. గంధసార...కస్తూరికాదులందున్ = మంచిగందము కర్పూరము కస్తూరి మొదలైనవానియందు.
  2. కుందకోరకరదనలు = మొల్లమొగ్గలవంటి దంతములు గలవారు, ప్రోడలు = నేర్పు గలవారు,
    మృదంగవేణుపరివాదినులన్ = మద్దెల పిల్లఁగ్రోవి యేడుతంతులవీణలచేత.
  3. జలజాత...విలాసంబులు = తామరపువ్వులవలని మిక్కుటమైపరిమళమునందు ఆసక్తములై మత్తుగొనిన తుమ్మెదలయొక్క వికాసముచేత మనోజ్ఞములైనవి, కాసారంబులు = సరస్సులు.
  4. ఆరూఢసమగ్రములు = ఎక్కిన (మీఁదనున్న) పూవులచేతను పండ్లచేతను పరిపూర్తినొందినవి, భూరి...రామములు = పెక్కండ్రు నాగరాజకన్యకలును వారిభర్తలును గలవి, ఆరామములు = ఉపవనములు.
  5. అప్పట్టునన్ = ఆస్థానమునందు, ఉపాస్తులు = సేవలు.