పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వరణంబుఁబోలె నెంతయుఁ, బరివృతమై చక్రవాళపర్వత మమరున్.[1]

87


ఆ.

అయుతయోజరంబు లైనవిశాలంబు, దత్సమానవిస్తృతంబు గలిగి
యఖిలజంతుమాన్య మైనలోకాలోక, ధారుణీధరంబు దనరుచుండు.[2]

88


ఉ.

కాంచనతుంగశృంగములు గల్గి ధరిత్రికిఁ గోటకైవడిన్
మించినచక్రవాళగిరిమీఁదను దారువుఁ బెట్టె మూసిన
ట్లంచితమై బెడంగగు నజాండకటాహము దానివెల్పలన్
మించినయంధకార మతినిర్భరమై కనుపట్టు దట్టమై.[3]

89


వ.

అట్టి బ్రహ్మాండంబునందు సప్తసాగరసప్తద్వీపసమేతయు స్థావరజంగమాదినానా
భూతసహితయు నైనభూమి ధాత్రియు విధాత్రియు ననునామంబులం
బరఁగుచుండు నట్టిభూమండలంబునకు నుచ్ఛ్రాయంబు డెబ్బదివేలయోజనంబు
లందుఁ బదేసివేలయోజనంబులక్రింద సతలవితలనితలగభస్తిమంతమహాతల
సుతలపాతాళంబు లనుసప్తలోకంబులు నుండు నవి శుక్లకృష్ణారుణపీతశర్కర
శైలకాంచనవర్ణంబు లైనభూములం గలిగి యనేకభుజంగమదైత్యదానవనివా
సంబులై యుండు వినుము.[4]

90


ఉ.

నారదమౌనినాథుఁ డొకనాఁడు రసాతలలోకసప్తకం
బారసి చూచి నాకుఁ దెలియం వినిపించిన వింటి సర్వబృం
దారకసిద్ధసాధ్యనరదానవనాయకు లున్నలోకముల్
భూరిభుజంగలోకములఁ బోలవు లాలితభాగ్యరేఖలన్.[5]

91


శా.

పాతాళంబుల రాజధానులు బహుప్రాసాదయుక్తంబులై
చేతోమోద మొనర్చుభూషణములున్ జీనాంబరశ్రేణియున్
దైతేయోరగదానవావలికి హృద్యంబై తనర్చున్ మణి
వ్రాతంబు ల్గల వెన్నియైన నతిశుభ్రస్ఫారవర్ణంబులన్.[6]

92


క.

తోయజబాంధవుఁ డెండలు, గాయు ననుష్ణంబు లైనకాంతులతోడం
బాయక చంద్రుఁడు వెన్నెల, గాయును శైత్యంబు లేని కాంతులతోడన్.[7]

93
  1. శుద్ధజలసాగరము = మంచినీళ్లసముద్రము, ఆవరణము = వెలుగు.
  2. అఖిలజంతుమాన్యము = ఎల్లజింతువులచేతను గౌరవింపఁదగినది, లోకాలోకధారుణీధరంబు = చక్రవాళపర్వతము, తనరుచున్ = వన్నె కెక్కుచు.
  3. కాంచనతుంగశృంగములు = బంగారుమయములై ఉన్నతములైనశిఖరములు, దారువుపెట్టె = బరణివంటి పెట్టె, అంచితము = మనోజ్ఞము, బెడంగు = అందము, అజాండకటాహము = బ్రహ్మాండ మనెడుకొప్పెర, అతినిర్భరము = మిక్కిలి యతిశయించినది.
  4. ఉచ్ఛ్రాయంబు = ఉన్నతము.
  5. లాలితభాగ్యరేఖలన్ = మనోజ్ఞమైన యదృష్టచిహ్నములచేత.
  6. బహుప్రాసాదయుక్తంబు = పెక్కులైన నగళ్లతోఁ గూడుకొన్నవి, చేతోమోదము = మనస్సంతోషము, చీనాంబరశ్రేణి = చీనాదేశపుపట్టువస్త్రములసమూహము, హృద్యంబు = ఇంపైనది - మనోజ్ఞమైనది, మణివ్రాతములు = మణులసమూహములు, అతిశుభ్రస్ఫారవర్ణంబులన్ = మిక్కిలి స్వచ్ఛమై యతిశయించిన వన్నెలచేతను.
  7. తోయజబాంధవుండు = సూర్యుఁడు, అనుష్ణంబులు = వేఁడిమి లేనివి, శైత్యము = చల్లఁదనము.