పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

విరివి యక్కొండ కేఁబదివేలయోజ, నంబు లంతియపొడవునై యంబరంబు
మోచి సురసిద్ధగంధర్వఖేచరులకు, నునికియై యుండు లోకైకవినుత మగుచు.[1]

78


క.

ఆరాజన్యతనూజుల, పేరన్ వర్షంబులయ్యె భేద ముడిగి బృం
దారకులయట్ల మానవు, లారాజ్యంబున వసింతు రనవరతంబున్.[2]

79


ఉ.

ఆరమణీయశైలమున కవ్వల నేలుచు నుండు నమ్మహా
వీరుఁడు వీరవర్ష మతివీరుఁడు ధాతకి యేలు నెమ్మెయిన్
వారల రెండుదేశములవారల కెప్పుడు రోగశోకదు
ర్వారవిమోహదుష్టగుణవైరజరాదులు చెంద వెయ్యెడన్.[3]

80


తే.

తాపసోత్తమ పుష్కరద్వీప మనను, మానసోత్తరశైలంబె కాని యొండు
క్షుద్రగిరులును నదులును జూడ నరిది, యందు వసియించుమనుజు లానందకరులు.[4]

81


క.

మదిలోఁ గోరినయప్పుడె, ముదమున నిష్టాన్నపానములు సమకూఱున్
బదివేలవత్సరంబులు, బ్రదుకుదు రాదీవి నున్నప్రజలు మునీంద్రా.

82


తే.

దండనీతి శుశ్రూషావిధానములను, నిపుణవర్ణాశ్రమాచారనిర్ణయముల
నుడిగి వార్తావిహీనులై యుండుదురు మ, నుష్యు లమరులయట్ల వినోదములను.[5]

83


క.

మానుగ నచ్చట బ్రహ్మ, స్థానం బగువటము మెఱయుఁ దద్దేశమునన్
నానామునిసంసేవితుఁ, డైనజనార్దనుఁడు బ్రహ్మయై తా నుండున్.

84


క.

ఆదీవిఁ దిరిగియుండును, స్వాదూదకజలధి దానిసమవిస్తృతమై
భూదేవ యిట్లు సప్తప, యోధులయం దొక్కకొలఁది నొనరు జలంబుల్.[6]

85


తే.

అట్టు లేడును జంద్రోదయాస్తకలిత, వేళలందును గాఁగినపాలఁ బోలె
మీఱి వేయింటిమీఁద నేనూఱువ్రేళ్ల, పొడవు పోటును నాటునై పొలుపు మిగులు.[7]

86


క.

అరుదైనశుద్ధజలసా, గర మవ్వలిభూమికెల్లఁ గడపటిదెస నా

  1. మర్యాద = ఎల్ల, పరివేషము = గాలిగుడి, అంబరంబు మోచి = ఆకాశము నంటి.
  2. బృందారకులయట్ల = దేవతలవలెనే, అనవరతంబున్ = ఎల్లప్పుడును.
  3. వైరజరాదులు = విరోధము పగ మొదలగునవి.
  4. ఒండుక్షుద్రగిరులు = ఇతరములైన చిన్నకొండలు.
  5. వార్తావిహీనులు = జీవనోపాయముచేత తక్కువైనవారు - జీవనోపాయమును ఆపేక్షింపనివారు.
  6. స్వాదూదకజలధి = మంచినీళ్లసముద్రము, సమవిస్తృతము = సమానమైనవిరివి గలది.
  7. చంద్రోదయాస్తకలితవేళలందున్ = చంద్రునిఉదయముతోడను అస్తమయముతోడను కూడిన కాలములయందు - చంద్రుడు ఉదయించునప్పుడును అస్తమించునప్పుడును, పోటు = ఉబుకుట, ఆటు = అడుపు - అలలతాఁకుడు అని యర్థము, పొలుపు = బాగు.