పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహేంద్రంబునను, ఋషికుల్యాకుమారాదులు శుక్తిమంతంబునను నుద్భవించె.
మఱియు ననేకపుణ్యనదులు శతసహస్రంబులు గలవు.

41


క.

ఇల నీభారతవర్షము, నలువున వేయేసియోజనంబులవిరివిన్
వెలయుచుఁ దొమ్మిదిదీవులు, గలయవి జలరాశిలోనఁ గడునధికములై.[1]

42


క.

ఇట్టిమహాద్వీపంబులు, నిట్టిమహానదులు గిరులు నిట్టిమహిమలుం
బుట్టవు తక్కినభూముల, గట్టిగ నీవర్షభూమిఁ గల్గినరీతిన్.

43


క.

చొక్కపుభారతవర్షం, బొక్కటి యగుఁ గర్మభూమి యఃర్వీస్థలిలోఁ
దక్కినవి భోగభూములు, నిక్కంబుగఁ దెలిసికొనుము నీ వని మఱియున్.[2]

44


క.

ధరలో జంబూద్వీపము, సరసన్నుత లక్షయోజనంబులు దానిం
దిరిగి లవణాబ్ధి యెంతయు, విరివిం గనుపట్టు లోకవిశ్రుతమహిమన్.

45


క.

ఆక్షారోదధి కవ్వలఁ, బ్లక్షద్వీపంబు వలయభంగిఁ దనర్చున్
లక్షింపఁ దద్విశాలము, లక్షద్వయయోజనంబులం గనుపట్టున్.[3]

46


క.

మోదంబున మేధాతిథి, యాదీవికి రాజు వానియాత్మజులై బా
హాదర్పోజ్జ్వలు లేడుగు, రాదిత్యసమానతేజు లై పుట్టుటయున్.

47


ఆ.

ఆకుమారకులకు నాద్వీప మేడు భా, గములు చేసి రాజ్యగౌరవములఁ
బెట్టుటయును వారిపేర వర్షంబులై, జగములందుఁ గడుబ్రశస్తి నొందె.

48


వ.

తదీయనామధేయంబులు వినుము శాంతహయశిశిరసుఖోదయనందశివక్షేమక
ధ్రువవర్షంబు లయ్యె. అవ్వర్షంబులనడుమం బొలిమేరలై గోమేధచంద్రనారద
దుందుభిసోమకసుమనోవైభ్రాజంబు లనుసప్తవర్షాచలంబులు మెఱయు. ఆపర్వ
తంబు నుద్భవిల్లి యనుతప్తయు శిఖియు విపాసవయుఁ ద్రిదివయుఁ గ్లమయు
నమృతయు సుకృతయు ననుమహానదులు సముద్రగామినులై ప్రవహించు
చుండు. మఱియు క్షుద్రనదులు పర్వతంబులు ననేకశతసహస్రంబులు గలవు.[4]

49


క.

ఆవర్షంబుల మనుజులు, దేవతలుం దారు గలసి తేజోధికులై
జీవింతురు వారికి రో,గావస్థలు లేవు ధర్మ మధికం బగుటన్.

50


సీ.

ఆదీవిఁ బ్రవహించినట్టియేఱులనీరు ద్రావినమానవతతులు నిర్ణీత
సంతోషహృదయులై సార్వకాలంబును దుఃఖ మెఱుంగరు దుర్వివేక
మణుమాత్రమును లేక యైదువేలేడులు పరమాయు వైనట్టిబ్రదుకుఁ గలిగి
తేజరిల్లుదు రందుఁ ద్రేతాయుగమునకు సమకాలధర్మముల్ జరిగి వచ్చుఁ

  1. జలరాశిలోనన్ = సముద్రమునకంటె.
  2. చొక్కపు = స్వచ్ఛమైన, ఉర్వీస్థలిలోన్ = భూప్రదేశమునందు.
  3. క్షారోదధిన్ = ఉప్పుసముద్రమునకు, వలయభంగిన్ = కడియమువలె.
  4. పొలిమేరలు = ఎల్లలు, సముద్రగామినులు = సముద్రమునుగూర్చిపోవునవి (లేక) సముద్రమును పొందునవి.