పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దగిలి క్రీడించుచుండుదురు భౌమస్వర్గంబు లైనకింపురుషాదివర్షంబులయందును.[1]

36


ఆ.

అధికపుణ్యమూర్తులకు విష్ణుభక్తుల, కందు నుండు టెల్ల నరిది గాదు
పాపకర్ములకును బదివేలజన్మంబు, లందునైన నుండ నలవి గాదు.[2]

37


వ.

వాసుదేవుండు భద్రాశ్వవర్షంబున హయగ్రీవరూపంబున, భారతవర్షంబునఁ
గూర్మరూపంబునఁ, గేతుమాలావర్షంబున వరాహరూపంబునఁ, గురువర్షంబున
మత్స్యరూపంబునఁ, దక్కినవర్షంబుల నానారూపధరుండై యుండు నట్టికింపురు
షాదివర్షంబు లెనిమిదింట నుండువారికి శోకంబును నాయాసంబురు నుద్వేగం
బును దీపనంబును లేక నిరతంకమానసు లగుచుఁ బదియును బండ్రెండువేల
వత్సరంబులు పరమాయువులై సుఖయింతురు. అద్దేశంబుల భౌమోదకంబులే
కాని వానలు లేవు భారతవర్షంబున బ్రత్యేకంబ కులపర్వతంబులును మహా
నదులు ననేకంబులు గలవు.[3]

38


సీ.

మునినాథ హిమశైలముననుండి దక్షిణలవణాంబునిధిదాఁక నవసహస్ర
యోజనవిస్తీర్ణయుక్తమై భారతవర్షంబు మెఱయు నావర్ష మెల్లఁ
గర్మభూమియు పుణ్యఘనులకెల్లను స్వర్గమోక్షంబులెల్లఁ బ్రత్యక్ష మతుల
దోషచిత్తులకు నధోలోకమార్గముల్ ప్రాపించు మునులు సుపర్వవరులు


తే.

నిందె వర్తింపఁ గోరుదు రెల్లనాఁడు, జపతపోదానయజ్ఞాదిసకలకర్మ
ములు యథాశక్తిఁ గావించి వలసినట్టి, లోకముల నుండుదురు బుధశ్లోక వినుము.[4]

39


తే.

మలయము మహేంద్రమును శుక్తిమంతవింధ్య, పారియాత్రంబులును ఋక్షపర్వతంబు
సహ్యగిరియును నాఁగఁ బ్రశస్తి నెగడె, భరతఖండంబునను గులపర్వతములు.

40


వ.

అందు శతద్రూచంద్రభాగాదులు మహేంద్రంబునను, వేదస్మృత్యాదులు
పారియాత్రమ్మునను, నర్మదాసురసాదులు వింధ్యంబునను, తాపీపయోష్ణీనిర్విం
ధ్యాదులు ఋక్షంబునను, గోదావరీభీమరథీకృష్ణవేణ్యాదులు సహ్యంబునను,
తామ్రపర్ణీకృతమాలాదులు మలయంబునను, త్రిసామాఋషికుల్యాదులు

  1. వాహినీచతుష్టయంబు = నాలుగునదులు, నిరంతరవినోదంబులన్ =ఎడతెగనివేడుకలయందు, తగిలి = ఆసక్తులై, భౌమస్వర్గంబులు = భూసంబంధియైన స్వర్గములు - స్వర్గమువలె భోగాస్పదములైన ప్రదేశములు.
  2. అరిది = దుర్లభము, అలవి = శక్యము.
  3. ఉద్వేగము = మనోవ్యథ - వగపు, దీపనంబు = తీఱనియాఁకలి, నిరాతంకమానసులు = భయము లేనిమనసు గలవారు, భౌమోదకంబులు = భూమియందలి యూటనీళ్లు.
  4. కర్మభూమియు = వైదికకర్మములను నడపుటయే ప్రధానకృత్యముగాఁగల భూమియే, పుణ్యఘనులకున్ = పుణ్యకర్మలచేత అధికులైనవారికి, అతులదోషచిత్తులకున్ = సరిపోల్పరాని పాపబుద్ధి గలవారికి, సుపర్వవరులు = దేవతాశ్రేష్ఠులు, ఎల్లనాడున్ = ఎల్లప్పుడును, యథాశక్తిన్ = శక్తికొలఁదిని, బుధశ్లోక = పెద్దలచేత పొగడఁబడినవాఁడా.