పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శీలించియు జన్మాంతర, కాలంబున విప్రుఁ డయ్యెఁ గర్మవశమునన్.[1]

14


క.

ఆనరపతిచరితం బెం, తైనఁ గలదు దానిఁ బిదప నంతయుఁ దెలియం
గా నీకు నేర్పరించెదఁ, గాని యిపుడు చెప్పుచున్నకథ విను తెలియన్.[2]

15


వ.

అట్టిభరతనందనుం డైనసుమతికి నింద్రద్యుమ్నండు పుట్టె. వానికిఁ బరమేష్ఠియు
వానికిఁ బ్రతిహారుండును వానికిం బ్రతిహర్తయు వానికి నుత్సన్నుండును
వానికి భవుండును వానికి గీతుండును వానికి బ్రస్తావుండును వానికిం బృథుం
డును వానికి నక్తుండును వానికి గయుఁడును వానికి నరుండును వానికి
విరోహణుండును వానికి ధీమంతుండును బుట్టిరి. అట్టిరాజన్యులవంశసంభవు
లయినమానవులు స్వాయంభువమన్వంతరంబున డెబ్బదిమహాయుగంబుల నేకవంశ
పరంపరులై ప్రవర్తిల్లి రనిన మైత్రేయుం డిట్లనియె.[3]

16


క.

భువనైకవంద్య స్వాయం, భువమన్వంతరనృపాలముఖ్యులనెల్లన్
వివరించి చెప్పితిని నా, కవియెల్లం దెలిసె నింక నడిగెద మిమ్మున్.

17


మ.

ధరణీమండలవిస్తృతంబు మఱి సప్తద్వీపరూపంబులన్
సరిదంభోనిధివర్షశైలవనవిస్తారంబులన్ దైత్య ని
ర్ణరగంధర్వపురక్రమంబుల సమస్తంబున్ వినంగోరెదన్
సరవిం జెప్పుఁడటన్న శిష్యునకు నాచార్యుండు దా నిట్లనున్.[4]

18


క.

నీయడిగినప్రశ్నలు మై, త్రేయ శతాబ్దములనైనఁ దీఱదు చెప్పం
దోయజభవునకు నైనను, జాయలుగా వినుము కథల సంక్షేపంబుల్.[5]

19


వ.

అది యెట్లనిన జంబూప్లక్షశాల్మలకుశక్రౌంచశాకపుష్కరంబు లనెడుసప్తద్వీపం
బులం బరివేష్టించి లవణేక్షుసురాసర్పిదధిదుగ్ధజలసముద్రంబు లేడు నొకటి
కొకటి ద్విగుణవిస్తారంబులై యుండు నీసకలద్వీపమధ్యంబున జంబూద్వీపంబు
విస్తరిల్లు. తదీయమధ్యంబునఁ గనకరత్నమయం బయిన మేరుపర్వతం బుండు.[6]

20


చ.

అనుపమలీల నొప్పుకనకాద్రికి ముప్పదిరెండువేలయో
జనములు మీఁదివిస్తరము సన్నుతమై పదియాఱువేలయో
జనములు లోనిశాలము నిజంబుగ నంతియపాతు నున్నతం
బెనుబదినాల్గువేలు గణియింపఁగ యోజనము ల్మునీశ్వరా.[7]

21


క.

భూపద్మమునకు నడుమై, యాపర్వత మొప్పుఁ గర్ణికాకారమునం

  1. చిన్మయసుఖములు = జ్ఞానమయమైన సౌఖ్యములను, శీలించి = స్వభావముగా గ్రహించి.
  2. ఏర్పరించెదన్ = విశదపఱిచెదను.
  3. పరంపరులై = పరంపర గలవారై, ప్రవర్తిల్లిరి = ఉండిరి.
  4. విస్తృతంబు = విరివి, సరిత్ = నదులయొక్కయు, అంభోనిధి = సముద్రములయొక్కయు, నిర్జర = దేవతలయొక్కయు, సరవిన్ = క్రమముగా.
  5. తీఱదు = ముగియదు, చాయలుగాన్ = జాడగా - కొంచెకొంచెముగా.
  6. పరివేష్టించి = చుట్టుకొని, ద్విగణవిస్తారంబులు = రెండంతలవిరివి గలవి.
  7. పాఁతు = భూమిలోపలి క్రుంగుడు, ఉన్నతము = ఎత్తు.