పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్ష్మీభోగంబుల నుల్లసిల్లిరి సునాశీరాదులుం దారు నే
కీభూతంబుగ ధర్మమార్గమున నక్లేశప్రభావోన్నతిన్.[1]

5


వ.

అందు జంబూద్వీపాధిపతి యైనయాగ్నీధ్రుండు, నాభియు కింపురుషుండును
హరివర్షుండును నిలావృతుండును రమ్యుండును హిరణ్వంతుఁడును కురుండును
భద్రాశ్వుండును కేతుమాలుండును ననుకుమారులఁ దొమ్మండ్రం గాంచె.

6


క.

ఇమ్ముగ జంబూద్వీపము, తొమ్మిదిఖండములు చేసి తోడ్తో సుతులం
దొమ్మండ్రను రాజులఁగా, నమ్మనుజేంద్రుండు చేసె ననుపమలీలన్.

7


వ.

ఇట్లు రాజ్యంబు విభాగించి యిచ్చి యాగ్నీధ్రుండు సాలగ్రామతీర్థంబునకుఁ
దపంబు సేయం జనియె. ఆనవఖండంబులు నారాజన్యుల పేర వర్షసంజ్ఞలం
ప్రసిద్ధంబు లయ్యె నందు.

8


క.

శీతగిరదక్షిణం బగు, భూతలపతినాభి యతనిపుత్రుఁడు వృషభుం
డాతని కొగిఁ బుత్రశతం, బాతతయశు లుద్భవించి రందఱియందున్.[2]

9


మ.

భరతుం డగ్రజుఁడై సమస్తధరణీభాగంబుఁ బాలించి దు
ష్టరిపువ్రాతము నుక్కడంచి మఖముల్ సమ్యగ్విధిం జేసి ని
ర్జరలోకేశ్వరుతోడివాఁ డగుచు శశ్వత్కీర్తి యార్జించుచుం
బరఁగెం దొంటి ప్రియవ్రతాదులగతి భవ్యప్రతాపోన్నతిన్.[3]

10


వ.

వానిపేర నాభివర్షంబు భరతఖండం బనంబరఁగె నట్టిభరతునకు నిజరాజ్యవైభవం
బొసంగి వృషభుండు పులహాశ్రమంబునకుఁ దపంబు చేయంజని.

11


శా.

వానప్రస్థవిధిన్ శతాబ్దములు దుర్వారస్థితిన్ నిల్చి క
ర్మానుష్ఠానము లన్నియున్ విడిచి దివ్యజ్ఞానసంపన్నతా
నూనప్రౌఢియు నగ్నరూపమును వీర్యోద్రేకముం గల్గి ని
ర్దీనుండై యవధూతమార్గమున ధాత్రిన్ సంచరించెన్ ధృతిన్.[4]

12


క.

భరతుండు పెక్కుకాలము, ధరణీతల మేలి చాలఁ దనిసి కుమారున్
దరుణార్కతేజు సుమతిని, జిరమతి రాజ్యాభిషిక్తుఁ జేసి కడంకన్.

13


క.

సాలగ్రామమునకుఁ జని, శ్రీలలనాధీశుఁ గొలిచి చిన్మయసుఖముల్

  1. భూపాలశిఖామణులు = రాజశ్రేష్ఠులు, చటుల...ప్రతాపములతోన్ = మిక్కుటమైన భుజగర్వము అణఁపగూడని విఖ్యాతి శేషబుద్ధి కౌశల్యము ప్రతాపము వీనిచేత, ఉల్లసిల్లిరి = వెలసిరి, సునాసీరాదులున్ = ఇంద్రుఁడు మొదలగువారును, ఏకీభూతంబుగన్ = ఒక్కటిగా, అక్లేశ = పీడారహితమైన.
  2. శీతగిరి = హిమవత్పర్వతము, ఒగిన్ = క్రమముగా, ఆతతయశులు = విశేషకీర్తి గలవారు.
  3. దుష్టరిపువ్రాతమున్ = దుష్టులైనశత్రుపులసమూహమును, ఉక్కడంచి = చంపి, సమ్యగ్విధిన్ = క్రమమైన విధమున, నిర్జర...వాఁడు = ఇంద్రునితో సమానుఁడు, శశ్వత్కీర్తి = అధికకీర్తిని, పరఁగెన్ = ప్రఖ్యాతి కెక్కెను, భవ్య = మేలైన
  4. శతాబ్దములు = నూఱేండ్లు, దుర్వారస్థితిన్ = ఆఁగఁగూడనియునికితో, దివ్య... ప్రౌఢియున్ = తత్వజ్ఞానముయొక్క కలిమిచేత కొఱఁత లేని నిపుణత్వముతో, నగ్నరూపము = దిగంబరాకారము, వీర్యోద్రేకము = వీర్యాతిశయము - ఊర్ధ్వరేతస్త్వము, నిర్దీనుఁడు = దైన్యము లేనివాఁడు, ధృతిన్ = ధైర్యముతో.