పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అదితితనూజుఁ డైనయమరాధిపుదారుణవజ్రధారచే
మదమఱి దైత్యదానవసమాజము గూలిన నష్టపుత్రయై
హృదయము విహ్వలింప దితి యిమ్ములఁ గశ్యపుఁ బెక్కుకాలముల్
వదలక సేవ చేసెఁ దనవంటిసపత్నులు తన్ను మెచ్చఁగన్.[1]

343


క.

అంతట వైవస్వతమ, న్వంతరమునఁ గశ్యపుడు నయంబునః బ్రీత
స్వాంతుండై యిచ్చెద నో, కాంతా నీ కేమివరము గావలయునొకో.[2]

344


క.

అనవుడు దితి దా నిట్లను, మునివర దేవేంద్రుఁ జంపి ముదమున శచితో
ననిమిషరాజ్యం బేలెడు, తనయుని నిమ్మనిన నతఁడు తగ నిట్లనియెన్.

345


ఆ.

ఏను నీకు గర్భ మిచ్చెద నూఱేఁడు, లంగశుద్ధి యైనయట్టివ్రతము
సలుపు మట్లయైన సత్పుత్రుఁ డుదయించు, నశుచివైన గర్భ మంతరించు.[3]

346


క.

అని చెప్పి పుత్రదానం, బొనరించి మునీంద్రుఁ డరిగె నుత్పలదళలో
చన మగఁడు చెప్పినట్టుల, ఘనముగ శుద్ధాంగి యగుచు గర్భముఁ దాల్చెన్.[4]

347


క.

దేవేంద్రుం డంతయు విని, తా వేడుకపుట్ట సవతితల్లికిఁ గడుమి
థ్యావినయంబులు సేయుచు, సేవించుచు నుండెఁ గపటశీలము మెఱయన్.[5]

348


వ.

ఇవ్విధంబునఁ దొంబదితొమ్మిదివత్సరంబులు చనిన నొక్కనాఁడు భోజనంబు చేసి
పాదప్రక్షాళనంబు సేయ మఱచి వికీర్ణశిరోజయై నిద్రించుచున్నసమయంబున
నింద్రుండు గర్భంబు ప్రవేశించి యర్భకుండు రోదనంబు సేయుచుండ నతండు
మారోదీ ర్మారోదీ యని పలుకుచు వజ్రంబు చేత శరీరంబు సప్తఖండంబులు
చేసి వానిన వెండియు నలువదితొమ్మిదితునియలు చేసి యింద్రుండు వోయె.
అట్టియేకోనపంచాశత్ఖండంబులు రూపంబులు ధరియించి యింద్రునకు సహాయు
లైరి. ఇంద్రుండు మారోదీ యనుటంజేసి వారు మరుద్గణంబు లైరి యని చెప్పి
మఱియు నిట్లనియె.[6]

349


క.

మును వైన్యుఁ డైనపృథునిన్, మునులందఱు గూడి రాజ్యమున కధిపతిఁగా
నొనరించిన యది మొదలుగ, వనజాసనుఁ డధిపతుల నవశ్యము నిలుపున్.[7]

350
  1. దారుణవజ్రధారచే = భయంకరమైన వజ్రాయుధముయొక్క వాదరిచేత, మదమఱి = క్రొవ్వు చెడి, సమాజము = సమూహము, నష్టపుత్ర = నశించినకొడుకులు గలది, విహ్వలించన్ = దుఃఖపరవశము కాఁగా, ఇమ్ములన్ = బాగుగా, సపత్నులు = సవతులు.
  2. నయంబునన్ = తిన్ననినడవడిచేత, ప్రీతస్వాంతుండు = ప్రీతినొందిన మనసుగలవాఁడు.
  3. అంగశుద్ధి = అవయవముల పరిశుద్ధత గలది, అంతరించున్ = నశించును.
  4. ఉత్పలదళలోచన = నల్లగలువఱేకలవంటికన్నులు గలది - దితి.
  5. వేడుక = కుతూహలము - ప్రియము, మిథ్యావినయంబులు = అబద్ధపువినయములను, కపటశీలము = వంచనతోగూడిన మంచినడవడి.
  6. వికీర్ణశిరోజ = విరియఁబోసికొన్నవెండ్రుకలు గలది, మారోదీ ర్మారోదీః = ఏడువ కేడువకుము, సప్తఖండంబులు = ఏడుతునియలు, ఏకోనపంచాశత్ఖండంబులు = నలువదితొమ్మిదితునియలు.
  7. వైన్యుఁడు = వేనునికొడుకు, వనజాసనుఁడు = బ్రహ్మ.