పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొడుకుతోడి వినోదంబులం దగిలి యనేకదివ్యసహస్రవర్షంబులు రాజ్యంబుఁ
జేసి తనిసి విష్ణుసాయుజ్యంబుఁ బొంద నిశ్చయించియు దనకు జన్మత్రయావసా
నంబునం గాని కైవల్యప్రాప్తి లేకుండుటంచేసి రజోగుణప్రేరితుండై క్రమ్మఱ
విష్ణుదేవునితో బద్ధవైరుం డైన.[1]

328


శా.

అంభోజాక్షుఁడు దుర్నిరీక్ష్య మగు ఘోరాకారమూర్తిన్ సభా
స్తంభస్థానమునం జరాచరభయత్రస్తంబుగా భీమసం
రంభం బొప్ప నృసింహుడై పొడమి యారాత్రించరాధీశ్వరున్
శుంభద్గర్వునిప్రాణముం గొనియె నస్తోకప్రభావంబునన్.[2]

329


వ.

ఇవ్విధంబున.

330


ఉ.

మోదముతోడ దైత్యవిభు మోక్షపదంబున నుండఁజేసి ప్ర
హ్లాదుఁ దదీయరాజ్యమున కర్షునిఁగా నభిషిక్తుఁ జేసి దే
వాదిసమస్తలోకముల నంచితసంపద నొంద నిల్పె దా
మోదరుఁ డమ్మహాత్మునిగుణోన్నతు లిట్లని చెప్పవచ్చునే.[3]

331


మ.

భగవద్భక్తిపరాయణుం డయినయా ప్రహ్లాదుఁ డత్యున్నతిన్
జగ మెల్లం దనధర్మమార్గము నిరస్తక్రోధవాక్యంబులం
బొగడన్ రాక్షసలోక మేలి మహిమం బొల్పారె సర్వంకషం
బగుకీర్తిన్ బహుపుత్రమిత్రసహితుండై యున్నచందంబునన్.[4]

332


తే.

అనఘ యష్టమి ద్వాదశి నమవసలను,
బౌర్ణమాసినిఁ బ్రహ్లాదు భవ్యచరిత
మర్థిఁ బఠియించువారల కర్థసిద్ధి, గలిగి భూదానగోదానఫలము లొదవు.[5]

333


వ.

అట్టిప్రహ్లాదునకు విరోచనుండును ఆయుష్మంతుండును శిబియును భాష్కలుం
డును నన పలువురు పుట్టిరి. అందు విరోచనునకు బలి పుట్టె. బలికి బాణాసురప్ర
ముఖు లగురాక్షసులు నూర్వురు పుట్టిరి. మఱియుఁ బ్రహ్లాదవంశసంభవులై
నివాతకవచులు మూఁడుకోట్లు పుట్టిరి. హిరణ్యాక్షునికి ఝర్ఝరియు శకునియు

  1. మూర్ధాఘ్రాణంబు = నడితల మూర్కొనుట, ఆనందబాష్పపూరితలోచనుండు = ఆనందబాష్పములచేత నిండిన కన్నులు గలవాఁడు, దురవస్థలన్ = దుర్దశలను - బాధలను, ఇందిరామందిరుఁడు = లక్ష్మికి ఉనికిపట్టయినవాఁడు, పెంపున= అభివృద్ధితో, ఆశ్వాసించి =ఊఱడించి, తగిలి = ఆసక్తుఁడై, జన్మత్రయావసానంబు = మూఁడుపుట్టుకలముగియికయందుఁ గాక, బద్ధవైరుండు = కట్టబడిన విరోధముగలవాఁడు - స్థిరమైనవిరోధముకలవాఁడు.
  2. అంభోజాక్షుఁడు = తామరలవంటి కన్నులు గలవాఁడు - విష్ణువు, దుర్నిరీక్ష్యము = చూడశక్యము గానిది, ఘోరాకారమూర్తిన్ = భయంకరమైన ఆకృతి గలదేహముతో, చరాచరభయత్రస్తంబుగా = చరములును అచరములును అగు ప్రాణులు భయముచేత చలించినవి కాఁగా, భీమసంరంభంబు = భయంకరమైన ఆటోపము, శుంభద్గర్వుని = అతిశయించినగర్వముగల హిరణ్యకశిపునియొక్క, అస్తోక = అల్పము కాని.
  3. మోక్షపదంబునన్ = ముక్తిస్థానమునందు, గుణోన్నతులు = గుణాధిక్యతలు, చెప్పవచ్చునే = చెప్ప శక్య మగునా.
  4. భగవద్భక్తిపరాయణుండు = భగవంతునిభక్తియం దాసక్తుఁడు, అత్యున్నతిన్ = మిక్కిలి ఘనతతో, నిరస్తక్రోధవాక్యంబులన్ = తొలఁగఁద్రోయఁబడిన కోపముతోడి మాటలతో - ఈర్ష్యలేని మాటలతో, సర్వంకషము = అంతట వ్యాపించినది.
  5. అమవస = అమావాస్య, పౌర్ణమాసి = పున్నమ, భవ్య = మేలైన, అర్థిన్ = శ్రద్ధతో.