పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కుమతిన్ దప్పులు పట్టఁగాఁ జనదు తద్ఘోరాఘము ల్వాపి పు
ణ్యమతిం జేయుము భక్తరక్షణకళావ్యాపారపారాయణా.[1]

321


మ.

హిమవత్పర్వతకూటసానువులనుం దేలించు హైమాంబుపూ
రముఁ జండాల గృహాగ్రభాగజలధారాసారభూరిప్రవా
హము భాగీరథిలోనఁ గూడి సమమైన ట్లొక్కరూపంబ హృ
త్కమలజ్ఞానియుఁ బాపకర్ముఁడుఁ ద్రిలోకాధీశ లక్ష్మీశ్వరా.[2]

322


ఆ.

అనిన దేవదేవుఁ డాతనిగురుభక్తి, యుక్తి మెచ్చి నీకు నుచితమేని
నీదుతండ్రి పుణ్యనిధిఁ జేసి మోక్షంబు, వర్థితోడ నిత్తు నంతమునను.[3]

323


క.

ఇంకొక్కవరము వేఁడుము, శంకాతంకములఁ బొందఁ జనదనినఁ గృపా
లంకారమూర్తి యగునా, పంకజనేత్రునకు దైత్యబాలకుఁ డనియెన్.[4]

324


క.

ధర్మార్థకామమోక్షద, కర్మంబుల శైశవాదికాలంబులు నీ
నిర్మలభ_క్తియుఁ గల్గగఁ, బేర్మిం గృప నీయు మిదియె ప్రియము ముకుందా.[5]

325


వ.

అనిన నద్దేవుం డతనికిఁ గైవల్యపదంబు మొదలుగాఁ గోరినవరంబు లొసంగి
యంతర్హితుం డైనంత దితిజబాలకుండు నిజపురంబునకుం జని తండ్రికి నమస్క
రించి కరంబులు మోడ్చియున్న యప్పుడు.[6]

326


క.

 హరివరమువలన నప్పుడు, హిరణ్యకశిపుఁడును దొంటియీరసమెల్లన్
బరిహృతమై సత్వగుణ, స్ఫురణమెయిం గౌఁగిలించె సుతుఁ బ్రహ్లాదున్.[7]

327


వ.

ఇట్లు గౌఁగిలించి మూర్ధఘ్రాణంబు చేసి యానందబాష్పపూరితలోచనుండై
కుమారా నాచేత ననేకదురవస్థలం పొందిన బొంది యిందిరామందిరుం డైనము
కుందుభక్తిపెంపునఁ జెడక నిలిచె. నాభాగ్యంబుగదా యని యతని నాశ్వాసించి

  1. అమరారాతి = దేవతలకు పగవాఁడయిన, దితిప్రసూతి = హిరణ్యకశిపువు, మదగర్వాంధుండు = క్రొవ్వుచేతను అహంకారముచేతను కన్ను గాననివాఁడు, నీభక్తి వైరమునన్ = నీయందలి భక్తివలనఁ గలిగిన విరోధముచేత, దోషములు = తప్పులు, దుర్వారస్థితిన్ = అడ్డము లేని విధమున, కుమతిన్ = బుద్ధిహీనుని, తద్ఘోరాఘములు = అతనియొక్క భయంకరములైన పాపములను, పాపి = పోఁగొట్టి, పుణ్యమతిన్ = ధర్మబుద్ధిగలవానిగా, భక్త...పారాయణా = భక్తులను రక్షించునట్టి విద్యయనెడు వ్యాపారమునందు ఆసక్తుఁడయినవాఁడా.
  2. హిమ...సానువులనుండి = మంచుకొండయొక్క శిఖరమునందలి చఱులనుండి, హైమాంబుపూరమున్ = మంచునీళ్లవెల్లువయు, చండాల...ప్రవాహమున్ = మాలవానియింటిముందటివాననీళ్లచేతనైన గొప్పవెల్లువయు, భాగీరథిలోనన్ = గంగానదిలో.
  3. గురుభక్తియుక్తి = తండ్రియందలి భక్తితోడి కూడికను - తండ్రియందు భక్తి కలిగియుండుటను, ఉచితమేని = తగుననితోచిన పక్షమున.
  4. శంకాతంకములన్ = సంకోచభయములను.
  5. శైశవాది = శిశుత్వము మొదలైన, పేర్మిన్ = ప్రేమతో.
  6. కైవల్యపదము = ముక్తిస్థానము, దితిజబాలకుండు = రాక్షసకుమారుఁడు - ప్రహ్లాదుఁడు, నిజపురంబునకు = తనయింటికి.
  7. ఈరసము=ఈర్ష్య - విడువనిపగ, పరిహృతమై = పోయి, సత్వస్ఫురణమెయిన్ = సత్వగుణముయొక్క ప్రకాశించుటచేత.