పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనరఁగ శౌరి వచ్చె వినతాసుతు నొక్కి రమాసమేతుఁడై.[1]

312


వ.

ఇట్లు ప్రత్యక్షం బైనపుండరీకాక్షునకు దండవన్నమస్కారంబులు చేసి కరం
బులు మొగిచి యానందబాష్పధారానిష్యందలోచనారవిందుండును హర్షపుల
కాంకురదంతురితాంగుండును బరమసంతోషసముద్గతగద్గదస్వరుండును నైనయ
బ్బాలకుశరీరంబు నాభికమలసంభూతచతుర్ముఖగండమండలస్పర్శోపలాలననిపుణ
ప్రశస్తంబు లైనహస్తంబుల నిమిరి గారవించి యిట్లనియె.[2]

313


క.

నీతండ్రి నీకుఁ జేసిన, పాతకములఁ జెడక పరమపరిశోభితపు
ణ్యాతిశయంబున ననుఁ గడుఁ, బ్రీతునిఁ జేసితిని పిన్నబిడ్డఁడ వయ్యున్.[3]

314


వ.

కావున నీకోరినవరం బిచ్చెద వేఁడు మనిన.

315


క.

ఏయేజన్మంబులయం, దేయేజంతువులయందు నెచ్చో నెచ్చో
నేయేగతి జన్మింపుదు, నాయాజన్మంబులందు నాకాలములన్.

316


క.

అవివేకికి సంసార, వ్యవహారమునందుఁ గల్గువాంఛ నిరతమున్
భవదీయపదంబులపైఁ, దవుల స్వరమిచ్చి నన్ను దయఁ జూడఁగదే.

317


వ.

అనినం బరమేశ్వరుం డిట్లనియె.

318


ఉ.

నీవు మహానుభావుఁడవు నీహృదయంబు మదీయభక్తితోఁ
జేవ వహించి యుండుట ప్రసిద్ధము ముక్తియెకాని యెమ్మెయిన్
భావిభవంబు లే దసురబాలక వైష్ణవకోటి కెల్ల నీ
త్రోవయ మేలుబంతి యఘదూరుఁడ వైతివి చెప్ప నేటికిన్.[4]

319


వ.

అది యట్లుండె నింక నొక్కవరం బడుగు మనిన నతం డిట్లనియె.

320


మ.

అమరారాతి దితిప్రసూతి మదగర్వాంధుండు నీభక్తి వై
రమునన్ నాయెడ పెక్కుదోషములు దుర్వారస్థితిం జేసె నా

  1. శ్రీతరుణీ...శోభితంబులు = లక్ష్మీదేవియొక్క స్తనములను కౌఁగిలించుకొనుటచేత మిక్కిలి శోభిల్లునవి, హస్తప్రయోజవిరాజితంబులు =కమలములవంటి హస్తములయందు ప్రకాశించునవి, ఉదంచిత...కాంతులన్ = ఒప్పిదములైన చంద్రసూర్యులకాంతులవంటి కాంతులతో, తనరఁగన్ = ఒప్పుచుండగా, వినతాసుతున్ = గతుత్మంతుని, రమాసమేతుఁడై = లక్ష్మీదేవితో కూడుకొన్నవాఁడై.
  2. దండవన్నమస్కారంబులు = సాగిలఁబడి చేయఁబడిన నమస్కృతులు, ఆనంద..విందుండు = సంతోషబాష్పములధారలు జాఱుచున్న కన్ను లనెడుకమలములు కలవాఁడు - కన్నులయందు ఆనందబాష్పములను విడుచుచున్నవాఁడు, హర్ష ... అంగుండు = సంతోషముచేత కలిగిన గగుర్పాటుచేత ఎగుడుదిగుడయిన అవయవములు గలవాఁడు, పరమ...స్వరుఁడు = అధికసంతోషముచేత వెడలుచున్న డగ్గుత్తికతోడి కంఠస్వరముగలవాఁడు, నాభి...ప్రశస్తంబులు = బొడ్డుదామరయందు జనించిన బ్రహ్మయొక్క చెక్కిళ్లను అంటి బుజ్జగించుటయందలి నేర్పుచేత ప్రశంసింపఁబడినవి, గారవించి = మన్నించి.
  3. పాతకములన్ = పాపకృత్యములచేత, పిన్నబిడ్డఁడవు = పసిబాలుఁడవు.
  4. చేవ = బలమును - దార్ఢ్యమును, భావిభవంబు = పునర్జన్మము, అఘదూరుఁడవు = పాపముల కెడమైనవాఁడవు - పాపములఁ పొందనివాఁడవు.