పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రకటగుణాభిరాముఁ డగుభాగవతోత్తముఁ డాత్మఁ జొక్కుచున్.[1]

300


వ.

ఇట్లు వినోదించుచుండి యొక్కనాఁడు హిరణ్యకశిపుకడకుం జని నమస్కరించి
కరకమలంబులు మొగిచి యిట్లనియె.

301

హిరణ్యకశిపుఁడు తనకు జ్ఞానోపదేశము చేయవచ్చినకొడుకును శిక్షించుట

మ.

దనుజాధీశ్వర నీకు నేమిటికి మిథ్యావైర మానీరజా
సనసంకల్పిత లైనయీయసురరాజ్యశ్రీల నీనెమ్మనం
బున నిక్కంబులుగాఁ దలంచి సకలంబుం దానయై తేజరి
ల్లినవిష్ణున్ భజియింప కేల కడుజాలిం బొందఁగా నక్కటా.[2]

302


క.

ని న్నింతవానిఁ జేసిన, యన్నలినజుతండ్రి విష్ణుఁ డట్టివిభునిచే
మన్ననలు గన్నవారల, కెన్నఁడు దుఃఖములు చెంద వెఱుఁగుము తండ్రీ.[3]

303


క.

నీవంటిఘనుఁడు సాత్వికుఁ, డై విష్ణునిఁ గొలువ కేల యతితామసమో
హావేశబుద్ధి మూఢుఁడ, వై విడిచితి మోక్షకరము లగుమార్గంబుల్.[4]

304


మ.

అనినం దానవచక్రవర్తి పటుకోపావేశదుర్వారుఁడై
ఘనహుంకారముతోడ లేచి వెస వక్షం బుద్ధతిం దన్నెఁ ద
న్నిన గోవిందపదారవిందములపై నెక్కొన్నచిత్తంబుతో
ననురాగంబున నుండె దైర్యనిధి ప్రహ్లాదుండు సాహ్లాదుఁడై.[5]

305


వ.

అంత దేవాంతకుం డంతకాకారుండై పౌలోమకాలకేయవిప్రచిత్తిరాహుప్ర
ముఖు లైనదానవులం బిలిచి యిద్దురాత్ముని పాశంబుల బంధించి సముద్రంబు
లోన వైచి చదియునట్లుగాఁ బర్వతంబులు శతయోజనప్రమాణంబులుగా వైచి
వధియించి రం డనినఁ దత్క్షణంబ వార లమ్మహాత్తునిం గొనిపోయి.[6]

306


ఉ.

క్రన్నన నాగపాశములఁ గట్టి మహాంబుధిలోన వైచి మీఁ
ద న్నిబిడంబు లైనవసుధాధరముల్ శతయోజనంబు ల

  1. ఒకమరి = ఒకసారి, కొనియాడున్ = పొగడును, నవ్వున్ = పరిహసించును, ఉబ్బినన్ = పొంగినను, నిబ్బరము = కదలక మెదలకయుండుటను, ప్రకటగుణాభిరాముఁడు = ప్రసిద్ధమైన గుణములచేత ఒప్పినవాఁడు, చొక్కుచున్ = పరవశత్వము నొందుచు.
  2. మిథ్యావైరము = అబద్ధపువిరోధము - వ్యర్థపుపగ యనుట, ఆనీరజాసనసంకల్పితలు = ప్రసిద్ధుఁ డైనబ్రహ్మచేత కలుగఁజేయఁబడినవి, తేజరిల్లిన = వెలిగిన, జాలిన్ = దుఃఖమును.
  3. నలినజు = బ్రహ్మయొక్క, మన్ననలన్ = ఆదరణలను, కన్నవారలకున్ = పొందినవారికి.
  4. సాత్వికుఁడు = సత్వగుణమువలనఁ గలిగిన సాధుభావముగలవాఁడవు, తామసమోహావేశబుద్ధిన్ = తమోగుణమువలనఁ గలిగిన అజ్ఞానమును పొందిన బుద్ధితో, మోక్షకరములు = ముక్తిని కలుగఁజేయునవి.
  5. దుర్వారుఁడు = అడ్డగింపఁగూడనివాఁడు, వెసన్ = వేగముగా, వక్షంబు = ఱొమ్మును, ఉద్ధతిన్ = మిడిసిపాటుతో, నెక్కొన్న = నెలకొనిన - చలింపక నిలిచిన, సౌహ్లాదుఁడు = ఆహ్లాదముతో కూడుకొన్నవాఁడు.
  6. అంతకాకారుఁడు = యమునివంటి ఆకృతిగలవాఁడు, ప్రముఖులు = మొదలగువారు, చదియునట్లుగాన్ = నలఁగి అణఁగిపోవునట్టుగా.