పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనమునఁ గొల్వలేక యభిమానమునం జెడిపోవ నున్ననా
జనకునియట్ల నీవును విచారవిహీనుఁడ వైతి వక్కటా.[1]

292


క.

అని యిట్లు పెక్కువిధముల, దనుజేశ్వరనందనుండు తద్దయుఁ గోపం
బున ధిక్కరించి యాడిన, విని గురుఁ డొండాడలేక వివశత నుండెన్.[2]

293


వ.

అంత నొక్కనాఁడు హిరణ్యకశిపుండు శతయోజనప్రమాణోన్నతంబై కనక
శైలంబు ననుకరించుహిరణ్యప్రాసాదతలంబున శీధుపానవినోదంబులఁ దగిలి
యంగనాజనసహితుండై యుండి ప్రహ్లాదుని రావించి నీతిశాస్త్రంబులు పఠి
యింపు మనిన నతం డిట్లనియె.[3]

294


ఉ.

శ్రీతరుణీకళత్రు సరసీరుహనేత్రుని సర్వలోకవి
ఖ్యాతచరిత్రు దైత్యమదగర్వవిచారణు వాసుదేవునిం
బ్రీతిమెయిన్ భజించి వలపించితి ధన్యుఁడ నైతి నింక నీ
నీతులు గీతులు జదువు నేర్పులు గీర్పులు నాకు నేటికిన్.[4]

295


చ.

అనవుడు రాక్షసేంద్రుఁడు భయంకరకోపవిఘూర్ణమానలో
చనములతోఁ దనూభవునిఁ జక్కఁగఁ జూచి దురాత్మ నీవు నా
తనయుఁడవై కులోచితముఁ దప్పి నిశాచరవైరి యైనదు
ర్జనుని ముకుందు నెన్నెదవు సారెకు నాదగుసమ్ముఖమునన్.[5]

296


ఉ.

ఎల్లజగంబులన్ బలిమి నేలెడునామహనీయవైభవం
బొల్లక నేఁడు నీవు పురుషోత్తమునిన్ భజియింపఁగోరి తీ
కల్ల సహింపఁజాల నినుఁ గట్టి వధించెదఁ జూత మింక నా
బల్లిదుఁ డైనవిష్ణునిప్రభావము నీదగుభక్తియుక్తియున్.[6]

297
  1. అనిమిష...పరాయణున్ = దేవతాసమూహమును కాపాడుటయందు ఆసక్తుఁడైనవానిని, దైత్యభీకరున్ = రాక్షసులకు భయమును కలుగఁజేసెడువానిని, వనరుహలోచనున్ = కమలములవంటి
    కన్నులు గలవానిని, సుజనవత్సలునిన్ = సజ్జనులయందు వాత్సల్యముగలవానిని, కరుణాపయోనిధిన్ = దయాసముద్రుని, అభిమానమునన్ = ఆహంకారముచేత.
  2. ధిక్కరించి = తిరస్కరించి, ఒండు = వేఱొకమాటను, వివశతన్ = పరవశత్వమును.
  3. శతయోజనప్రమాణోన్నతంబు = నూఱామడకొలఁది పొడువుగలది, కనకశైలంబు = బంగారుకొండ, అనుకరించు = సరిపోలు, ప్రాసాదతలంబునన్ = మేడమీఁద, శీధుపాన = మద్యపానమునందలి, తగిలి = ఆసక్తుఁడై, ఆంగనాజన = స్త్రీసమూహముతోడ.
  4. శ్రీతరుణీకళత్రున్ = లక్ష్మీదేవి భార్యగాఁ గలవానిని, సరసీరుహనేత్రుని = కమలములవంటి కన్నులు గలవానిని, సర్వ...చరిత్రున్ = ఎల్లలోకములయందు ప్రసిద్ధినొందిన నడవడికలవానిని, ధైత్య... విదారణున్ = రాక్షసులయొక్క మదమును అహంకారమును భేదించునట్టివానిని, భజించి = సేవించి, వలపించితిన్ = ప్రీతి నొందించితిని.
  5. భయంకర...లోచనములతోన్ = వెఱపును కలుగఁజేయునట్టి కోపముచేత తిరుగుచున్న కన్నులతో, దురాత్మ = చెడ్డబుద్ధిగలవాఁడా, కులోచితమున్ = కులఘనతకుఁ దగిన నడవడిని, నిశాచరవైరి = రాక్షసులకు పగవాఁడు, సారెకున్ = మాటిమాటికి, సమ్ముఖమ్మునన్ = ఎదుట.
  6. కల్ల = తప్పును, బల్లిదుఁడు = బలవంతుఁడు, ప్రభావము = మహిమము.