పుట:Andhra-Bhashabhushanamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xii

మరికొందఱు చింతామణియందుఁ దత్సమపదవిషయవ్యాకరణ మెక్కువగలదనియు, గేతన గ్రంథమునఁ దత్సమేతరపదవిషయవ్యాకరణ మెక్కువగలదనియు, ఆకారణముననే తెనుఁగుభాగమునకు ము న్నెవ్వరును వ్యాకరణము చెప్పలేదని కేతన యనెననియుఁ గొన్నికల్పనలు కల్పింతురు. అవి విమర్శసహములు గావు. కొంచెము తారతమ్యమున్నను రెండుగ్రంథములు రెండువిషయములను స్పృశించియే యున్నవి. కొన్నివిషయములలో వేఱువేఱుమార్గముల వ్యాకృతి గావించినవి. అంతమాత్రమునఁ గంఠోక్తిగాఁ జెప్పినవిషయము కొట్టివేయ వీలులేదు. కావున నన్నయభట్టాది కవిజనులగ్రంథములు ప్రమాణములుగాఁ గేతన గ్రహించెననుట యుక్తము.

ఇంతకును ఆంధ్రశబ్దచింతామణి యను పేరుగలిగి సంస్కృతభాషలోనున్న తెనుఁగు వ్యాకరణము నన్నయభట్టకృతమగునా? కాదా? యనునంశము వివాదగ్రస్తము. నన్నయభట్టకృతమనుట కనేక విప్రతిపత్తులు లేకపోలేదు. దానినిగుఱించి వ్రాయఁబూనినచో నొకపెద్దగ్రంథ మగును. అప్పటికిని ఇదమిత్థమనితేల్పఁ గొన్నిచోట్ల నవకాశము గల విషయము గాదు. మొట్టమొదటి పాఠములుగల