పుట:Ananthuni-chandamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యతిప్రాసములు

"యతిప్రాసనియమము త్యజించుట కాంధ్రలోక మంగీకరించునని తోఁపదు” అని జయంతి రామయ్యగారు కవిజనాశ్రయపీఠికలో కొన్నికారణము లిచ్చి సిద్ధాంతము చేసినారు. ఈనియమములను త్యజింపవలయునని గాని త్యజించరాదనిగాని శాసించి నిర్బంధించకూడదనిన్ని, త్యజించదలచుకొన్నవారిని పాటించదలచుకొన్నవారిని సమదృష్టితో చూడవలసినదనిన్ని నాయభిప్రాయము. ఈనియమములు శబ్దాలంకారములవలె ఐచ్ఛికముగా వాడుకోవచ్చును; లేదా ఇవి విడిచిపెట్టి యుక్తివిశేషము ప్రధానముగా పెట్టుకొని రసవంతముగా కావ్యములు చెప్పవచ్చును. సంస్కృతశ్లోకములకు తెలుగుపద్యములలో ఉండవలెనన్న నియమములు లేవు. అంతమాత్రాన కాళిదాసాది మహాకవుల కావ్యములకు ఏమి లోటు కలిగినది? వాటికంటే తెలుగుకావ్యములకు వళ్లవల్లను ప్రాసములవల్లను వచ్చిన ఘనత ఏమి?

"శబ్దస్వరూపము నిర్ణయించుట కత్యంతోపయోగకరము” లని రామయ్యపంతులుగారి అభిప్రాయము. వడిప్రాసములు లేకపోయినా సంస్కృతభాషాశబ్దస్వరూపము వేదకాలమునుండి నేటికిని ఎక్కువ చక్కగా నిర్ణయించవచ్చును గదా. అయితే ఇతరసాధనము లున్నవందురేమో. సూర్యారాయనిఘంటువువంటి నిఘంటువులున్ను, అచ్చు మొదలయిన ఇతరసాధనములున్ను వచ్చుచున్నవిగనుక వడిప్రాసములవంటి సాధనములు శబ్దస్వరూపనిర్ణయమున కిక నవసరమని తోచదు.