పుట:Ananthuni-chandamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఆంధ్రవాఙ్మయాభివృద్ధి కీ నియమములు బాధకములుగా ఉండియుండకపోయిన" వని రామయ్యగారి అభిప్రాయము. నన్నయ, తిక్కన మొదలయిన మహాకవులు సయితము వడిప్రాసముల కోసము పొల్లుమాటలు వాడుక చేసినట్లు వందలకొలది ఉదాహరణములు చూపించవచ్చును.

ఇటువంటి నియమములు పాటించవలెనని నిర్బంధముగా ఉన్నంతకాలము ఆంగ్లవాఙ్మయము ఎట్లుండెనో స్వేచ్ఛ కలిగిన తర్వాత (Romantic Period) లో ఎట్లు అభివృద్ధి పొందినదో చూడండి.

పద్యములకు నడక ప్రధానమైనది. పద్యముల కుండవలసిన ఈ ముఖ్యలక్షణమును స్పష్టముగా తెలియజేసేటట్లు లాక్షణికులు కొన్నిచోట్ల సరియైన లక్ష్యలక్షణపద్యములను ఇయ్యలేదని నా యభిప్రాయము. ఈ విషయమును గురించి “తెలుగు”పత్రిక 5, 6, 7, 8 సంచికలలో నేను వ్రాసిన “ఛందోరహస్యదర్పణము”ను చూడండి.

సీసములు

లాక్షణికు లందరిలోను అనంతుడు ఎక్కువగా పదిసీసభేదములను చెప్పినాడు.

1. సమసీసము — (సామాన్యసీసము; విశేషలక్షణమేమీలేదు.)