పుట:Ananthuni-chandamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కేశవాయ తే నమోఽస్తు కృష్ణ పాహిపాహి యనుఁచు
           గేలుమొగచి మౌళినునిచి కృష్ణుఁ బలికెననుచునిట్లు
దేశభాషణములఁ జెప్ప ద్విగుణతురగవల్గనమునఁ
           దేరు విజయమంగళంబు తీయచెఱకు రసమునట్లు.

55

అందుద్విరదగతియనురగడ—

శ్రీయువతి నిజయువతిఁ జేసి యెంతయు మించి
కాయజునిఁ దనతనయుఁ గా నెలమిఁ బాటించి
సకల దేవతలఁ బరిజనులుగా మన్నించి
ప్రకటగతి శ్రుతుల నుతిపాఠకులఁ గావించి
హరి యొప్పు నన నొప్పు నవతార లఘువిరతి
శరది నగనలలభలసలతరలద్విరదగతి.

56

అందు జయభద్రరగడ—

శ్రీకి నొడయం డనఁగఁ జిత్తజునిగురుఁ డనఁగ
           శేషశయనుం డనఁగఁ జెలువుగఁ జతుర్భుజుఁడు
నాకౌకసుల నేలు నముచిసూదనువూజ
           నతఁడు దాఁగైకొన్న నందగోపాత్మజుఁడు
ఇతనిఁ గొల్చినఁ గాని యిహపరంబులు గలుగ
           వితరసేవల ననఁగ నెసఁగు నివ్విభుఁ డంచుఁ
జతురమతు లొనరింప జయభద్రరగడ లిటు
           సద్ద్విరదగతి రెంటఁ జాటింపులం బెంచు

57

అందు మధురగతియనురగడ—

శ్రీవనితాధిపుఁ జేరి భజింపుఁడు
భావజజనకుని భక్తిఁ దలంపుఁడు