పుట:Ananthuni-chandamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. “చరణచరణమున కాద్యక్షరములు వళులయ్యె” అప్పకవీయము.

ఈసందర్భమున వడి (వళి) కి బదులుగా యతి, విరతి మొదలయిన పర్యాయపదములలో మరియేదిన్నీ వాడకూడదన్నట్లే తోచును. సంస్కృతశ్లోకములలో పాదములమధ్యమందు విశ్రాంతిమాత్రమే ఉంటుందిగాని తెలుగు పద్యములలో ఉన్నట్లు అక్షరమైత్రిలేదు. గనుకనే కాబోలు వడి (వళి) యను తెలుగుమాట తెలుగు ఛందస్సులలో వాడవలసివచ్చినది. వృత్తి అంటే మార్గమని అర్థము. పద్యపాదము విశ్రాంతి ననుసరించి రెండు భాగములు కాగా ఆభాగముల మొదటి అక్షరములు పాదభాగములకు మార్గములు చూపించిన ట్లుండుటచేతను, మొదటిభాగముయొక్క ప్రథమాక్షరముతో (అనగా పాదాద్యక్షరముతో) రెండవ భాగము మొదటి అక్షరము మైత్రిగలదిగా ఉండవలెనన్న నియమము ఆచారమై ఉన్నది గనుకను, వడి (వళి) అని మీద చూపించిన స్థలములలో లాక్షణికులు ప్రయోగించి ఉందురని నా అభిప్రాయము.

వడిభేదములు

కవిజనాశ్రయములో పదివిధములైన వళ్లుమాత్రమే ఉన్నవి. కావ్యాలంకారచూడామణిలో పండ్రెండున్ను, ఛందోదర్పణములో ఇరువైనాలుగున్ను, అప్పకవీయములో నలువదిఒకటిన్ని, వళిభేదములు కనిపించుచున్నవి. ఈలాగున వర్ణసంఖ్య ఎక్కువతక్కువగా ఉండుటకు కారణ మేమై ఉండును? తక్కువగా