పుట:Ananthuni-chandamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛందోవిషయములు

ముఖ్యమైన ఛందోవిషయములు ఈ చిన్నపీఠికలో ఇముడ్చుటకు వీలయినంత మట్టుకు చర్చించి లాక్షణికులలో గల మతభేదములను తెలియజేయుచున్నాను.

వడి

"యతి పర్యాయపదములలో వడియనునది తెలుఁగు; దానివ్యుత్పత్తి యూహ్యము”అని జయంతి రామయ్యపంతులుగారు కవిజనాశ్రయపీఠికలో వ్రాసినారు. వారు వ్రాసినట్లు వడి' 'వళి' అనేవి తెలుగుమాటలనిన్ని వళ్ అనే అఱవమాటతో సంబంధము కలవి అనిన్నీ నాఅభిప్రాయము. యతి, విరతి మొదలయిన పర్యాయపదములతో పాటు వడి(వళి) అనేమాటను లాక్షణికులు వ్యవహరించుచున్నను దీనికి ఒక అర్థవిశేష మున్నట్లు స్పష్టముగా కనిపించుచున్నది. “ఆద్యోవళిః” అనే ఆంధ్రశబ్దచింతామణి సూత్రములోను, అందుకు అనువాదముగా ఉన్న తెలుగు లక్షణగ్రంథములలోని పద్యములందున్ను 'వడి, (వళి) అనే ఉన్నదిగాని 'యతి, విరతి' మొదలైన పర్యాయపదములలో మరియేదీ కనబడదు. చూడండి.

1. “చరణాద్యక్షరమేవడి” కవిజనాశ్రయము.

2. “పాద ప్రథమాక్షరముత్పాదితమగు వళియనంగ” కావ్యాలంకారచూడామణి.

3. “వాసనగల మొదలివ్రాయి వడియనఁబరగున్" ఛందోదర్పణము.