పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమారుడు భోజనం సరిగా చేయడు, మాటలాడడు, రాత్రులు నిద్రపోడు. అస్తమానమూ ఉస్సురంటూ ఉంటాడు. కళ్ళు గుంటలు పడ్డాయి. నందిధర్ముడు కొంచెం భయపడ్డాడు. “ఏమిటిది ప్రభూ?” అని ఒక దినాన వర్తకకుమారుని ఎదురుగుండా నిలుచుండి, అతని భుజాలు పట్టి కదిపివేసి, అడిగినాడు. ఆ యువకుడు మాట్లాడలేదు సరికదా తలవాల్చుకొని, కుంగిపోయి కూలబడి ఉన్నాడు.

“వెనక ఈ బాలికను చూచినప్పుడు ఇంత అందంగా కనబడలేదా? కాకపోతే వెనుకటి అందం అంతా మాయమై సాధారణ మైపోయిందా రాజకుమారి?”

“నన్ను చంపకు.”

“అమ్మయ్య! ఇన్నాళ్ళకు మాటొకటి ఊడిపడింది. మహాప్రభువుకు ఇదంతా విరహవేదన కాబోలు. ఉండండి లేత అరటిఆకులు, పన్నీరు, అన్నీ తెప్పించగలను.”

“నీకు బుద్ది ఉందా?”

“ఆ! ఇతరుల సంగతి నేను చెప్పలేను. నాకు ఉన్నదొక్కబుద్ధే. అదే నా ఆస్తిపాస్తీ. నాకేమీ రాజ్యాలులేవు కొట్లులేవు, అమ్మేందుకు భూషణాలులేవు.”

“నోరు మూయవోయి ఇంతట.”

“ఎవరిది ప్రభూ?”

“నీ విషయం శ్రుతిమించి రాగాన్ని పడుతోందే!”

“మీ విషయం రాగాన్నుంచి మూర్చనలోకి ఉరకటంలేదు కాబోలు. అచ్చంగా చంద్రాపీడులయ్యారు. మీ సభలో నాటకాలు వేసేవారు మీ అంత బాగా శృంగారం అభినయిస్తేనా, ఎంత బహుమతి దొరికేదో?”

“నాదంతా అభినయమంటావు?”

“అభినయం కాకపోతే నిజమే అనుకోండి. నా అభ్యంతరమా!”

“ఓరి ఛండాలుడా ఎంతమాట అంటున్నావురా?”

“నన్ను ఓ పదిపూలచెండులు వేసికొట్టరాదూ?”

ఆ బాలకుడు కొంచెం అర్థహాసం చేసినాడు.

“సరే, ఇంతకూ నీ ఆలోచన ఏమిటి?”

“ప్రభువుల ఆలోచనే నా ఆలోచన.”

“మొత్తుకున్నట్లుంది!”

“ఉన్నట్లుండడ మెందుకు? నిజంగ మొత్తుకుంటున్నాను!"

“ఎందుకూ?”

“ఇంతకన్న అందమైన బాలికలున్నారనీ, ఈబాలిక మనకు సాధ్యం కాదనీ.”

“ఓయి వెఱ్ఱివాడా! సాధ్యంకానిపని అనేది పులమావి చక్రవర్తి ఎరగడు. ఈ బాలిక సౌందర్యం నామతి పోగొట్టింది. ఈ బాలిక నాకు రాణి కాకపోతే నాకు చక్రవర్తిత్వమూ వద్దు, జీవితమూవద్దు. ఈ బాలిక నా అంతిపురానికి వచ్చిందాకా నాకీ బాధ తప్పదు. ఏమి అందం, ఏమి అందం, ఏమి అందం!”

“చిత్తం! ఎందుకా అందం? వట్టి బంగారుబొమ్మ. ముసికలోనే ఉండి మీరూ ఓ బంగారు బొమ్మను చేయించుకోరాదూ?”

అడివి బాపిరాజు రచనలు - 6

87

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)