పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఆమె కన్నులు కన్నులా? అవీ....”

“కావు. ఆలి చిప్పలు”

“ఆమె నుదురు, పెదవులు, చెవులు, ఆమె శరీరకాంతి, ఆమె వక్షస్సౌభాగ్యము....”

“మహాప్రభూ! మీకు ఈ బాలికే కావాలంటే....”

“అలా దారికిరా. త్వరగా చెప్పు ఏం చెయ్యాలో.”

“మీరు ఆమెను ఎత్తుకొనిపోయి పెళ్ళిచేసుకోవడమే మార్గము.”

“ఆ ఎత్తుకుపోవడం ఏలాగు? ఆ తర్వాత ఏమవుతుంది?”

“ఎత్తుకుపోయే ఉపాయాలు పన్నుదాము. వెంటనే వివాహం. ఇంక అల్లుడిపైన కత్తిగడతాడా శాంతిమూలుడు? పెళ్ళయితే ఏలాంటి బాలిక అయినా క్రమంగా అలవడుతుంది.”

“అమ్మయ్యా! నా ఉపాయమే నీకూ వచ్చింది. ఇంక మనం ఈ ఊరునుంచి విడిది ఎత్తివేయాలి.”

“నేను సిద్ధం మహాప్రభూ! అయినా ఒక్కసారి తాము శాంతిమూల మహారాజును దర్శించి, బేరాలు బాగా సాగినాయి అని మనవిచేసి, వారి కొమరిత మాత్రం నగలేమీ కొనలేదని యాధాలాపంగా చెప్పినట్లు చెప్పి, ఏదో ప్రాభృతం సమర్పించండి. ఆ మరునాడు మనం బయలుదేరిపోదాము.”

“బాగానే ఉంది నీ ఉపాయం.”

“అయితే వెంటనే ఏర్పాట్లు చేస్తాను. ఆమెను తస్కరించి వచ్చిన క్షణంనుండి మీరు సప్తమేఘాలు ఒకసారి అవతరించినట్లు, ద్వాదశార్కులు ప్రజ్వరిల్లినట్లు పరాక్రమించి దుర్నిరీక్షులయిపోవాలి.”

“తథాస్తు!”

9

ఆంధ్రశాతవాహనుల మహాసామ్రాజ్యము, ఇక్ష్వాకుల మహారాజ్యము. అయినా బీదతనం ఉంది. కోటీశ్వరులెప్పుడు ఉంటారో బీదవాళ్ళూ అప్పుడే ఉంటారు. కోట్లకొలదీ బంగారుకాసులు చెట్లను పండవు. అయినా బంగారం భూమిలో దొరుకుతుంది; నదీగర్భాలలో దొరుకుతుంది.

బంగారంకోసం పాటుపడాలి. త్రివిష్టపంనుంచీ, హిమాలయాలనుంచీ, మేరు పర్వతంనుంచీ బంగారం వస్తుంది. బంగారం తళతళ లాడుతుంది, కాబట్టి సువర్ణం. శతకుంభ పర్వతంలో దొరుకుతుంది గనుక శాతకుంభం జంబూనదియందు దొరుకుతుంది గనుక జాంబూనదం. ఇంకా ఇది స్వర్ణగిరిలో దొరుకుతుంది. వేణ్ణానదిపుట్టే నంది పర్వతాలలో దొరుకుతుంది. స్వర్ణముఖీనదిలో దొరుకుతుంది. బంగారం ఎంతటివానినై నా మాయలో ముంచగలదు. బంగారానికి దాసులు కానివారెవరు? హరిశ్చంద్రుడు బంగారానికి అమ్ముడుపోయాడు. బ్రహ్మబొడ్డునందు బంగారము దాచుకొన్నాడు. అగ్ని తన కేశముల బంగారుతో రచించుకొన్నాడు. స్వర్ణనది తన కెరటాలలో బంగారు పద్మాలను అలంకరించుకొన్నది.

అడివి బాపిరాజు రచనలు - 6

88

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)