పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బౌద్దాయని కళ్ళనీళ్ళుకారిపోతూ ఉండగా వెక్కివెక్కి ఏడుస్తూ అంతఃపుర రక్షకురాలి ఎదుట గజ గజ వణుకుతూ సాష్టాంగపడి “రక్షించుతల్లీ! పది బంగారు పణాలూ ఒక నీలిరంగు ఉంగరమూ బహుమానం ఇచ్చారు. మన నగరంలో అందరు రాజకుటుంబాల వారూ కొన్నారట. రాజకుమారికగారుపుచ్చుకొంటారని వారికై ఎన్నో చిత్ర చిత్రభూషణాలు తీసుక వచ్చారట. ఎలాగన్నా రాజకుమారిగారి దర్శనం చేయించమన్నారు. అంతే నండి” అని ఘొల్లుమన్నది.

8

ఈ మధ్య శాంతిశ్రీ మనస్సులో ఏవో ఆవేదనలు మొలకలెత్తాయి. అవి ఆవేదనలని ఆమెకు తెలియదు. ఆమె కూర్చోలేకపోయింది. నిలుచుండ లేకపోయింది. ఇటూ అటూ పదచారం ఏస్తూ ఉండేది. భోజనం అంత సహించేదికాదు. ఏదో ఆలోచన. ఆ ఆలోచనకు తలాతోకాలేదు. వానిని గూర్చి ఆమెకు ఏమీ తెలియదు.

మహారాజకుమారికి వంట్లో బాగాలేదని అంతఃపురపాలకురాలు భయపడి పోయింది. రాజ్యవైద్యుడు వచ్చి పరీక్షచేసినాడు. ఒంట్లో ఏమీ జబ్బు కనబడలేదు ఆయనకు. రాజకుమారి మనఃప్రవృత్తి ఆ వైద్యునకు పూర్తిగా తెలియును ఆమెకు దుఃఖములు, కాంక్షలు, పట్టుదలలు ఏమీలేవని ఆయన పూర్తిగా గ్రహించే ఉన్నాడు. శాపగ్రస్తయై ఒక దివ్యభూమిని ఈ జన్మ ఎత్తిందని ఆయన నమ్మకం అతి నిశితమైన బుద్ధి కలిగి ఉండీ మనోవికారాలు లేకపోవడానికి ఇంకోకారణంలేదు. ఆ బాలిక పుట్టినప్పటినుండి ప్రతిఘట్టమూ ఆయనకు తెలియును. ఆమె యోగిని అని వైద్యుడెప్పుడూ అనుకోలేదు. మనోవికృతులు ఆమెలో ఉద్భవించడానికి ఓషధీయుక్త తైలాలెన్నో ఆ సద్బ్రాహ్మణుడు పయోగించేవాడు. అందువల్ల ఆమె బుద్ది మరింత వికసించింది, ఆమె దేహం మరింత ఆరోగ్యవంతమయింది. ఇంక ఆమెలో కామాది వికారాలు ఉదయింపజేసే ఔషధం ఎక్కడ ఉన్నది?

ఈ దినాన రాజకుమారిలో ఏదో ఒక విచిత్రపరివర్తన ఆమెకు తెలియకుండానే ఉద్భవించి ఉంటుందని వైద్యులవారు ఊహించుకొని పరిచారికలను, సఖులను, అంతఃపుర పాలకురాలినీ విచారణ చేసినాడు. ఇన్నాళ్ళనుంచీ జరిగిన విషయాలాయన ఎరిగినవే అయినా, వానిలో ఉండే పరమార్ధ మావైద్యవృషభునకు తెలియలేదు. ఆ వైద్యుడంతట అంతఃపుర పాలకురాలికి ఉపచారవిధులు కొన్ని ఉపదేశించి వెడలిపోయెను.

శాంతిశ్రీదేవి యధాప్రకారం వారాని కొక్కపర్యాయము తన చదువు కోసం బౌద్ధసంఘారామానికి పోవుచున్నదే కాని, ఆమె సంగీతం చిత్రలేఖనమూ నేర్చుకొనదు. బౌద్ధగీతాలూ, జాతకగాథలూ వింటూ ఉంటుంది.

ఆ వర్తకులు తమ విడిది చేరారు. వర్తక కుమారునకు లోకభావమే నశించింది. ఆతడు కనురెప్పలు మూయకుండా శూన్యాన్ని చూస్తూ గడియ లుంటాడు. లేదా, కళ్ళుమూసుకొని పండుకొని ఉంటాడు. నందిధర్ముడు రెండు దినాలు చూశాడు. ఆ

అడివి బాపిరాజు రచనలు - 6

86

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)