పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనకరాష్ట్ర మహాసామంతుడైన అడవి స్కందవిశాఖాయనక బ్రహ్మదత్తప్రభువు విజయపురి వదలిన శుభముహూర్తంలోనే ఒక వర్తకుడు తన స్నేహితుడైన శ్రోత్రియునితో, అంగరక్షకులగు ఏబదిమంది అశ్వికులతో, నాలుగు ఏన్గులతో, పది ఒంటెలతో, ఇరువది కంబళి వ్యాహకములతో, బయలుదేరి కృష్ణదాటి విజయపురికి విచ్చేసినాడు. ఆ రత్నాల వర్తకుని ఉద్యోగులు కొంద రదివరకే వచ్చి పట్టణవర్తక ముఖ్యోద్యోగిని, వణిక్ సంఘ పంచాయతీ సభ్యులను కలుసుకొని, వణిక్ చక్రవర్తికి తగిన విడిదిలు ఏర్పాటు చేసినాడు. ముసికనగర మహాసామంతుడైన పులమావి శాతవాహనప్రభువు ఆ వర్తక చక్రవర్తిని సర్వవిధాల ఆదరింపుడని శాంతిమూల మహారాజునకు సుహృల్లేఖ పంపినాడు.

యౌవనమధ్యస్థుడూ, విలాసమూర్తి అయిన ఆ వర్తకోత్తముడు అనుచరులతో, తనకై వర్తకోద్యోగి ఏర్పాటు చేయించిన విడిది చేరి, స్నానాదికాలు నిర్వర్తించి భోజనంచేసి, కొంతకాలం ప్రయాణపు బడలిక తీరేటట్లు విశ్రమించాడు.

శుభముహూర్తంనాడు విడిదిలోనే వజ్ర, వైఢూర్య, గోమేధిక, పుష్యరాగ, నీల, మౌక్తిక ప్రవాళ, గారుత్మత, పద్మరాగాది రత్నాలు ఉంగరాలుగా, హారాలుగా, బాహువురులుగా, కంకణాలుగా, మేఖలాలుగా, మంజీరాలుగా రచించిన భూషణాలగానూ విడిగానూ, రత్నవర్తకులకూ ప్రభువులకూ ప్రదర్శింప ప్రారంభించినాడు. ఆ వర్తకుడు స్వయంగా మహారాజదర్శనము చేసుకొని వారికి నవరత్నములు పొదిగిన కంఠమాల ఒకటి సమర్పించెను. మహారాజు ఆ భూషణము ప్రాభృతముగా స్వీకరింప నిరాకరించి కోశాధ్యక్షునిచే మూల్యము నిప్పించెను.

నవరత్నాలే కాకుండా ఆ వర్తక కుమారుడు బంగారపు కణికలను, బంగారపు ఇటుకలనుకూడా విరివిగా అమ్మకము సాగించినాడు. వణిక్ సంఘాధ్యక్షునకు చక్కని ఉంగరము బహుమాన మిచ్చినాడు. విజయపుర ప్రభువైన స్కందవిశాఖాయనక ధనకప్రభువు తాను వచ్చినదినమున పూంగీప్రోలు వెళ్ళినాడని విని ఆ వర్తకోత్తముడు ఎంతో కించపడినాడు. పది దినాలు గడచిపోయినవి.

ఒక రాత్రి తన పడకగదిలో మంచంమీద పండుకొని ఉండగా వినోదుడు రత్నకంబళిపై అధివసించి ఆ వర్తకకుమారునితో మాట్లాడుతూ ఉండెను.

“మహారాజు మన బహుమాన మెందుకు తీసికొనలేదంటావు?”

“మహాప్రభు! మీరు తప్పటడుగు వేసినారు. తెలివితక్కువ అక్కడే ప్రారంభమయింది."

“ఏమిటా తెలివితక్కువ?”

“మీరు ఆ భూషణం ప్రాభృతంగా సమర్పించడంవల్ల మహారాజుకు మీ మీద అనుమానం కలగవచ్చును!”

“అనుమానం ఎందుకు? నేను చేసింది తప్పుపని కాదుగదా?”

“ప్రభూ! వర్తకులు మహారాజులకు అంతటి ప్రాభృతం ఇవ్వడం విపరీతంకాదా?”

“అది అలా ఉంచుగాని మన శాంతిశ్రీకి, యువకుడైన బ్రహ్మదత్తుడు చదువు చెప్పుచుండెనటగా?” అని వర్తకకుమారుడు వినోదుణ్ణి ప్రశ్నించాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

82

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)