పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మదత్తుడు: మహాప్రభూ, రాజకీయ విషయాలు కొన్ని చర్చించాలని వచ్చాను. ఇక్కడికి రాగానే మహారాజకుమారిని చూచినాను. వారు నన్ను తిరిగి తమ చదువు ప్రారంభింపుమని కోరినారు.

ఆ మాటలు వింటున్న శాంతిమూలునకు విపరీతమైన అనందం కలిగింది. ఆ ఆనందము పైకి ఏమీ కనబడనియకుండా మహారాజు బ్రహ్మదత్తప్రభువు వైపు తిరిగి, “ధనకప్రభు, రాజకుమారి చదువు మన జైత్రయాత్రమూలాన భంగం అయినందుకు విచారిస్తూ, అమ్మాయి మళ్ళీ చదువు ఎప్పుడు ప్రారంభించగలదో కనుక్కోడానికే ఆమెను ఇక్కడకు తీసుకొని వచ్చాను. ఆ విషయం మా అమ్మాయికి తెలియదు. మా కన్నతల్లి మిమ్ము పాఠాలు ప్రారంభించండి అని అడగడం మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది “అని సెలవిచ్చినారు.

శాంతిశ్రీ: మహాప్రభూ! శుభముహూర్తముచూచి బ్రహ్మదత్త ప్రభువే చదువు మళ్ళీ ప్రారంభిస్తారు.

శాంతిమూల: ఇంక ఒక విషయం ఉన్నది. రేపు వసంతోత్సవాలు వస్తున్నవి. ఈలోగా బ్రహ్మదత్తప్రభువు పూంగీప్రోలు పట్టణం పోయి మీ పెద్ద మేనత్త పూంగీరాష్ట్ర మహారాణి శాంతశ్రీనీ, మహారాజును, వారి కొమరిత శాంతశ్రీ రాకుమారిని, వారి బాలుడు రాజకుమారుని తీసుకొనివస్తారు. అలా రాక వారు పూంగీప్రోలులోనే వసంతోత్సవానికి ఏర్పాటులుచేస్తే మనమందరము పూంగీప్రోలే ఆ ఉత్సవాలకోసం వెళ్ళవలసి ఉన్నది.

శాంతిమూల మహారాజు హృదయం వెంటనే బ్రహ్మదత్తుడు అర్థం చేసుకొన్నాడు. "రాజకుమారీ! నేను పూంగీప్రోలునుండి రాగానే మీకు చదువు ప్రారంభిస్తాను” అని తెలిపినాడు. బ్రహ్మదత్తుడు మహారాజుకడ సెలవుపొంది, శిష్యురాలు నమస్కరించగా ఆశీర్వదించి, మహారాజునకు నమస్కరించి, ఆశీర్వాదం పొంది వెడలిపోయినాడు.

శాంతిమూలుడు కొమరితచెయ్యి పుచ్చుకొని “రాతల్లీ! నా పూజా మందిరానకు. ఆ మందిరంనుండి మహారాణి బుద్ధపూజామందిరానకు వెడుదువుగాని” అని ఆమెను లోనికి కొనిపోయినారు. శాంతిశ్రీ తండ్రి పూజామందిరానికి, తల్లి పూజామందిరానికి వెడుతూ ఉంటుంది. అయినా ఆమెలో భక్తి చైతన్యము ఏమీకలుగలేదు. తానుకూడా పూంగీప్రోలు వసంతోత్సవాలకు వెళ్ళవలసి ఉంటుందా అని ఆమె ఆలోచించుకొన్నది. ఈ బాలిక బ్రహ్మదత్తప్రభువును తారసిల్లినపుడెల్ల ఏదో స్పందించిపోతున్నది. ఈమెను స్త్రీని చేయగల శక్తిమంతుడా యువకుడే అని శాంతి మూలుడు అనుకొన్నాడు.

6

బ్రహ్మదత్తప్రభువు మహారాజులో మాట్లాడిన మూడు దినాలకు విజయపురంనుండి సపరివారంగా పూంగీప్రోలు బయలుదేరెను. పూంగీప్రోలు సముద్రతీర పట్నం. విజయరపురినుండి కోటలా ఉన్న కొండలు దాటి, కొండలావల పల్లవభోగముగుండా అరువదిరెండు గోరుతాలు ప్రయాణం చేస్తే పూంగీప్రోలు వస్తుంది. చంద్రవంక, నాగనది, తుంగభద్రల మీదుగా మహారాజపథం, సస్యశ్యామలమైన భూమిగుండా వెళ్ళుతుంది.

అడివి బాపిరాజు రచనలు - 6

81

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)