పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“రాకుమారీ! ఆ వసంతోత్సవ విషయం మరిచిపోయి, ఆనాటి సంఘటన జరగలేదనుకో! నాకు వివాహం అంటే ఇష్టమని అనుకోకు. వైరాగ్య పథాలలోనే నామనస్సు ఎప్పుడూ విహరిస్తోంది. వివాహం నా హృదయ విహంగానికి బంగారు పంజరమే!”

బ్రహ్మదత్తుడీ మాటలని చిరునవ్వు నవ్వి, ఆమెను తీవ్రంగా పరిశీలిస్తూ, పరిశీలించనట్లు నటిస్తూ “నేను ఆ దినాన నీ దివ్యసౌందర్యానికి ముగ్ధుడనై అలా చేసినాను. నీకు గురుత్వం చేసినపుడు నా మనస్సులో అట్టి వికారం కలుగలేదు. ఆ ముహూర్తంలో బాలికలందరూ నన్ను మన్మథునిగా ఎన్నుకోగానే ఎట్ట ఎదుట శుకమహర్షిని కూడా దాసుణ్ణి చేసుకోగలిగిన నీ సౌందర్యం దివ్యమైగోచరించింది. ఏమిచేస్తున్నానో తెలియకుండానే వచ్చి నీ మెడలో దండవైచినాను. అందువల్ల నాకు సంప్రాప్తించిన స్వత్వాన్ని నేను అత్యంత విచారంతో ఆ వెంటనే వదలివేసినాను” అని నెమ్మదిగా పలికినాడు.

“విచారం ఎందుకు మీకు?”

“సర్వదా శాంతమైన నీ పవిత్రహృదయాన్ని మూర్బుడనై కలచివేసినందుకు."

“ప్రభూ! మీరు నా నిమిత్తం ఏమీ మనస్సులో ఉంచుకోకండి! క్షణికమైన నా అందం చూచి మీరు మోసపోయి ఉంటారు.”

“ఈ సృష్టిలో క్షణికంకానిదేది రాజకుమారీ?”

“నిర్వాణం."

“నిర్వాణం సృష్టికి ఆతీతంకదా. క్షణికమైన జీవితంలో ఉంది. మనుష్యుడు శాశ్వతమైన నిర్వాణం వాంఛిస్తున్నాడు.”

“ఆ వాంఛకూడా గుణమేనా?”

“అదీ గుణమే.”

“శుద్ధ నిర్వాణముగాని, శుద్ధ స్థితప్రజ్ఞగాని గుణాతీతత్వాన్ని సూచిస్తుంది” అని తామే సెలవిచ్చినారు ప్రభూ!"

ఆ మాటలు వింటూ బ్రహ్మదత్తుడు నవ్వుతూ “నా పాఠం నాకే అప్పగింత చేసినావా రాకుమారీ?”

ఎప్పటికైనా ఈ బాలికలో స్త్రీత్వము స్పందనమౌతుందా అని బ్రహ్మదత్తు డనుకొన్నాడు. 'గుణాతీతత్వ'మని అన్నది కాని అది ఏమిటీ అని ఆ బాలిక ఆలోచించు కుంటున్నది. ఇంతలో మహారాజు వీరిరువురు పీఠాలపై అధివసించి, మాటలాడు కొనుచుండిన ఆలోచనా మందిరానికి వేంచేసినారు బ్రహ్మదత్తప్రభువూ, శాంతిశ్రీకుమారీ లేచి నిలిచిరి. బ్రహ్మదత్తుడు మహారాజు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదము పొందినాడు. మహారాజు తమ పీఠము అధివసిస్తూ, బ్రహ్మదత్తుడువచ్చి రాకుమారిని కలవడం భగవన్నిద్దేశము. వీరిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. అదికూడా శుభసూచకం. ఈ ప్రభువులోని మహత్తరమైన శక్తి తన కొమరితను స్త్రీని చేయలేదా అని తలపోసినారు.

శాంతిమూల మహారాజు: విశాఖాయనక ప్రభూ! మీరు దయ చేసిన విషయము.

అడివి బాపిరాజు రచనలు - 6

80

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)