పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మీరు పదినెలలు ఇక్కడలేరు. తిరిగివచ్చిన నెలాపదిహేను దినాలు చదువు తిరిగి ప్రారంభించలేదు.”

“రాజకుమారీ! రాజధర్మానికి మహారాజుగారివెంట యుద్ధయాత్రకు వెళ్ళాను.”

“వచ్చిన వెంటనే ఎందుకు ప్రారంభింపలేదు?”

బ్రహ్మదత్తప్రభువునకు ఆశ్చర్యము ఇంకా ఎక్కువై మిన్నుముట్టింది. ఈ బాలికకు యవ్వనవతులగు బాలికలకు ఉండే సహజమైన సిగ్గు లేనేలేదు. సౌందర్యంలో లోకానికే శిఖరము ఈమె! ఈమెను చూసిన క్షణంనుండి తాను ఓడిపోయినాడు. పరమేశ్వరుడే అపరాజితాదేవి. సర్వసృష్టిలో ఈ పరమసౌందర్యమూర్తిని చూచి మన్మథుని పూలబాణాలకు గురిఅయినాడు. రాజకీయ శ్లేష్మంలోపడి కొట్టుకొనే ఈగలా ఉన్న తన బ్రాహ్మణత్వమూ, వైరాగ్యమూ ఈ దివ్యబాల సౌందర్యంముందు ధైర్యం వహించి ఉండగలవా? ఎప్పటికైనా ఈ బాలిక హృదయంలో వలపు అంకురించునా?

“రాజకుమారీ! నేను రహస్యం దాచుకోలేను. క్రిందటి వసంతోత్సవాలకు నన్ను బాలికలందరూ మన్మథునిగా ఎన్నుకొన్నారు నేను రతీదేవిని ఎన్నుకోవలసి ఉండి మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు వర్ణనాతీతమైన సౌందర్యవతులు. కాబట్టి మిమ్ము రతీదేవిగా నేనానాడు ఎన్నుకొన్నాను. ఆ ఎన్నుకొనడానికి కారణం మీ అందము. నా కళ్ళు మిరుమిట్లు గొన్నాయి. ఇతికర్తవ్యతా మూడుడనై వెనువెంటనే మిమ్ము రతీదేవిగా ఎన్నుకొన్నాను.”

“ప్రభూ! నన్ను మీరు రతీదేవిగా ఎన్నుకొన్నప్పుడు నాకు ఏదో బాధ కలిగింది” అని శాంతిశ్రీ తలవాల్చింది.

5

శాంతిశ్రీ తలవాల్చడమేమిటి అవి బ్రహ్మదత్తప్రభువు ఆశ్చర్యమందినాడు. అస్పష్టమైన నిట్టూర్పు ఒకటి ఆ యువక ప్రభువు చెవినిబడి అతనికి మరీ ఆశ్చర్యం కలిగించింది. రెప్పలువాల్చే దేవతలను చూస్తే ఎవరికి ఆశ్చర్యం కలుగదు?

మరుసటి నిమేషంలో శాంతిశ్రీ తలఎత్తి “మీరు శుభముహూర్తము చూచి త్వరలో చదువు మళ్ళీ ప్రారంభించండి. రతీదేవి గొడవ నాకు తెలియదు. వసంతోత్సవము, వసంతుని ఎన్నిక, వనరమును వసంతుడే నిర్ణయించటం, అలాగే మన్మథుని బాలికలు ఏర్పరచుట, అతడు రతిని ఎన్నుకొనుట ఈ ఆచారాలు నాకు తెలుసును. అలా ఎన్నుకోబడిన బాలికలు వారివారికి భార్యలు కావలసి ఉంటుందనీ నాకు తెలుసును. భార్యాభర్తల ధర్మాలను శాస్త్రాలు విపులీకరించాయి. కాని ఆ ధర్మాలలో చెప్పబడ్డ మనోభావాలు ఏలా కలుగుతాయో నాకు తెలియదు ప్రభూ! అందుకని నేను మీకు రతీదేవిని ఎలా కాగలను? నన్ను మీరు వివాహం చేసుకుంటారు. నేను మీకు భార్యనై లాభమేమి? నాకు భార్యాత్వమంటే ఏమిటో తెలియదు. మా నాయనగారు ఆజ్ఞ ఇస్తే, మీరు తప్పదు అంటే, మీకు తప్పక భార్యనౌతాను. కాని ఆ తర్వాత ఏమిటి?”

శాంతిశ్రీ కనుబొమలు ముడిపడినాయి. పాలసముద్రంలో చిరు కెరటాలు ఏర్పడినా సౌందర్యమే భాసిస్తుంది. ముడులుపడిన శాంతిశ్రీ కనుబొమలు కూడా ఆమె సౌందర్యానికి ఇంకా ఎంతో అందం చేకూర్చినాయి.

అడివి బాపిరాజు రచనలు - 6

79

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)