పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

డుగో మా చిట్టన్న” అని కలకలలాడుతూ యశోదనాగనిక అన్న చెంతకు ఉరికింది. నాగదత్తుడు చెల్లెలిని హృదయమునకు చేర్చి, భుజములుపట్టి సువ్వున పైకి ఎత్తివేసినాడు. యశోదే మంచి ఒడ్డూ పొడుగూ గల దిట్టరిపిల్ల. ఆ బాలిక అన్నగారిముందు చిన్న బిడ్డలా ఉంటుంది. ఒక్క ఎగురు ఎగరవేసి ఆ బాలికను క్రిందికి దింపాడు. ఇదంతా ఆశ్చర్యంగా తారానికి చూస్తూ నిలుచుంది.

“చిట్టన్నా! ఈ అమ్మాయి తారానిక. నా స్నేహితురాలు. మేమిద్దరం రాజకుమారిగారి నగరులో కవలపిల్లలం” అని యశోదనాగనిక నవ్వుతూ స్నేహితురాలి దగ్గరకు పరుగెత్తి “తారా! మా చిట్టన్నయ్యను చూచావా? ఈయనగారు గొప్పవీరుడు” అన్నది.

తారానికను రెప్పవాల్చకుండా నాగదత్తుడు చూస్తూ అలాగే నిల్చున్నాడు. అతని చూపులలోని తైష్ణ్యము చూచి తారానిక తల వంచేసింది. ఆమె మోము కెంపువారింది. ఈ బాలిక ఎంత అందంగా ఉంది! ఈమె కృష్ణానది కెరటం కాదుగదా అని నాగదత్తుడను కొన్నాడు. ఈ బాలిక ఇన్నాళ్లనుంచీ ఎక్కడ ఉంది? ఈమె మహాయుద్ధంలో విజయం పొందిన సేనాపతి నవ్వులా ఉంది. మెరుగుపెట్టిన కృపాణంలా ఉంది. ఈమె సావాసంచేసి తన చెల్లెలు ఎంత అదృష్టవంతురాలయింది. ఈమె మహావేగంతో వెళ్ళేపారశీకాశ్వం యొక్క నడకలాఉంది. ఈ బాలిక తన ఇంటికిరావడంవల్ల ఈ ఏటి వసంతోత్సవం నిజమైన వసంతోత్సవం కాబోతున్నది. ఈమె వసంత వనంలో పూచిన పూవులన్నీ ఒకచోట ప్రోగుచేసినట్లుగా ఉంది అనుకున్నాడు.

ఏమిటీ ఇంత అందంగా ఉన్నాడు! పల్లెటూళ్లలో ఇంత అందమైన పురుషులు ఉంటారా? ఎంతబలమో అతనికి, ఎంతచక్కని సోగమీసాలు! అ విశాలమైన వక్షం ఏనుగు నుదురు జ్ఞాపకం తెస్తోంది. సింహవక్షంలా ఉన్నది. సింహమంత బలమైనవాడా? అని తారానిక ఆలోచించుకొంది.

పల్లెటూరంత అందమైన ప్రదేశం ఇంకోటి లేదనుకొంది తారానిక. దినమూ తారానిక గదిలోనికి తంగేడుపూలు, అడవిమల్లెలు, కలిమిపువ్వులు, సూర్యకాంతాలు, చేమంతులు, చెట్టుసంపెంగ పువ్వులు దొంతర్లు దొంతర్లు వచ్చేవి. ఇవి ఎక్కడనుంచి వస్తున్నాయో తారానికకు తెలుసును. తారానికకు చలిదిఅన్నము, ఊరగాయ, గేదెపెరుగు అలవాటయింది. ఉదయమే స్నానం చేసేది. స్నేహితురాలూ తనూ తల దువ్వుకొనేవారు. చక్కని వస్త్రాలు కట్టుకొని చలిదిబువ్వలు ఆరగించడానికి పోయేవారు. తిరిగి వారిరువురూ గదిలోనికి వచ్చేసరికి తారానిక మంచంమీద పూలగుత్తులుండేవి. తారానికకు ఈ పూలు ఎల్లా వస్తున్నాయో స్వయంగా చూడాలని బుద్ధిపుట్టింది. ఒకరోజు యశోద భోజనం చేస్తూంటే తారానిక, “తింటూ ఉండు పని ఉంది యశోదా”అని ఆరగించకుండా పరుగున వచ్చి తమ గదిలో మంచంక్రింద దూరి కూర్చుంది.

అలా దాక్కొందో, లేదో నెమ్మదిగా అడుగువేసుకుంటూ నాగదత్తుడా గది చొచ్చి, తారానిక దాగిన మంచం దగ్గరకువచ్చి, తిరిగి నెమ్మదిగా అడుగు లిడుచు వెళ్ళిపోతూ

అడివి బాపిరాజు రచనలు - 6

65

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)