పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగినాడు. అతని పాదాలు ఆమె తోలు పెట్టెకడకు దారి తీసినాయి. భోజనానికి వెళ్ళుతూ తారానికి పెట్టెతాళ్లు ముడివేయలేదు. నాగదత్తుడు పెట్టెకడ వంగి పెట్టెతెరచి, అందులో నుండి ఏదో తీసుకొని, మళ్ళీ పెట్టెమూత నెమ్మదిగా వేసి, పిల్లి అడుగులు వేసుకుంటూ గదిగుమ్మందాటి వెళ్ళిపోయినాడు.

తారానిక చటుక్కున మంచంక్రిందనుంచి వచ్చి పెట్టెతెరచి ఏమి తీసుకొనివెళ్లి ఉంటాడు అని వెదకింది. తాను ప్రయాణమై వచ్చిన దినాన కట్టుకొన్నస్తనవల్కల మామె కాపెట్టెలో కనిపించలేదు. ఆ బాలిక చిరునవ్వు నవ్వుకుంటూ గుండె కొట్టుకుంటూ ఉండగా భోజనాల సావిడికడకు పరుగెత్తింది. యశోద భోజనం చేయకుండా కూర్చుని ఉంది.

యశోద: ఎందుకే వెళ్ళావు? ఇంతసేపు చేశావు?

తారానిక: నా వల్కలం ఒకటి ఎక్కడుందా అని జ్ఞాపకం వచ్చి వెళ్ళి వెదికాను. ఎక్కడా కనబడలేదు.

యశో:చాకిరేవుకు పోయిందేమో!

తారా: అబ్బే, అది మొన్ననే చాకలిది పట్టుకువచ్చింది.

యశో: ఎక్కడ పెట్టావు?

తారా: తోలు పెట్టెలో.

యశో: ఆహఁ! చిత్రంగా ఉందే! మా ఇంటిలో ఏవీ పోవే. తిన్నగా వెదికావా?

తారా: ఆ.

యశో: నేను వచ్చి వెదుకుతా ఉండు. ముందర భోజనంచేయి.

ఇద్దరూ భోజనం చేసినారు. తరువాత ఇద్దరూ వెళ్ళి గది అంతా వెదకినారు. ఇల్లంతా వెదకినారు. ఆ స్తనవల్కలం ఎక్కడా కనబడలేదు. లోపల నవ్వుకుంటూ తారానిక స్నేహితురాలితో కలసి ఇల్లంతా వెదికింది. ఎక్కడ కనబడుతుందో ఆమెకే తెలుసును. తారానికకు అల్లరిచేయాలని బుద్ధిపుట్టి, నాగదత్తుడు పొలానికి వెళ్ళి ఒక దినం అదను చూచి, నాగదత్తుని గదిలోనికి పోయి అతని అయుధాలలో ఒక చక్కని చురకతీసి, తన గదికి కొనివచ్చి, ఆమె అలంకారపు చందుగలో దాచుకొన్నది. ఆ మరునాడు నాగదత్తుడు అన్నబిడ్డలను, వసంతోత్సవానికై వచ్చిన తన పెద్దతోబుట్టువు బిడ్డలను, అన్నలను, యశోదను, తల్లిని ఇంట్లో పనివాళ్ళను అందరినీ తన చిన్న కత్తిని తీసినారా అని అడగడం, గడబిడ చేయడం చూచింది. తనలో తాను చిరునవ్వు నవ్వుకుంది. తన గదిలో ఏమీ ఎరుగనిదానిలా పువ్వులు గుచ్చుకుంటూ కూర్చుంది. నాగదత్తుడూ చెల్లెలు యశోదా మాట్లాడే మాటలు వింటూంది.

నాగదత్తుడు: ఎల్లా పోయింది చెల్లీ?

యశోద: అదే నాకు ఆశ్చర్యం వేస్తూంది.

నాగ: ఆ ఛురిక చాలా మంచిది సుమా.

యశోద: సేనాపతి నీకు ఇచ్చినది కాబోలు

నాగ: అంతకన్నా ముఖ్యం. విజయదశమి వీరోత్సవాలలో మొదటి వాణ్ణిగా నెగ్గినందుకు మహారాజుగారిచ్చిన బహుమతితోపాటు ధనక ప్రభువు తను ఛురికనే నాకిచ్చారు.

అడివి బాపిరాజు రచనలు - 6

66

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)