పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైద్యులు ఆమెకు వెర్రికాదన్నారు. అయిదవ సంవత్సరమున చదువు ప్రారంభించి నప్పటినుండీ ఆమె గురువులు ఆమె విపరీత మేధకు, ఆమె గ్రహణశక్తికీ ఆశ్చర్యపూరితు లయ్యారు. ఆమె విద్యాగురువుల ద్వారాలన్నీ దాటి సర్వ విద్యాపరిపూర్ణియై, ఆర్యశ్రీ ఆనందార్హతులకడ శిష్యురాలయినది. భౌద్ధధర్మ శిక్షితురాలై నప్పటినుంచి ఆమెకు చైతన్యము వచ్చినది. ఆమె చిరునవ్వులు మోమున తొంగిచూడ నారంభించినవి. ఆమె సుకుమారమైన హాస్యముకూడా చేయడం సాగించినది. ఆమెకు కాశ్మీరకుసుమవర్ణ వస్త్రాలంటే ఇష్టమయినవి. మిరియములు, జీలకఱ్ఱ, నల్లజీల కఱ్ఱ, అల్లము, శొంఠి, శర్కర, గుడములేని ఆహారము లామెకు ఇష్టమైనవి.

నానాటికి ఆమె సౌందర్యము విజృంభించి, ఆమె యవ్వనము పొడసూపి, ఆమె పెదవుల అమృతాలు చెమరించి, ఆమె వక్షావలి కుచము లుప్పొంగి, ఆమెకటి విస్తరింప మొదలుపెట్టి, ఆమె పిరుదులు ఘనత వహింప నారంభించి ఆమెలో ఏవియో మసృణకాంతులు ప్రసరింప నారంభించినవి. ఆ దినాలలో అట్లు విజృంభించు ఆ సౌందర్య విషయమే ఆమెకు తెలియదు. వైరాగ్యమననేమో తెలియదామెకు. భిక్కుని అగుట మంచిదనే బౌద్ధధర్మం ఆమెకు తెలియును. భిక్కునికావడం ఎందుకో ఆమెకు తెలియదు. విజ్ఞాన విషయంగా వైరాగ్యాన్నిగూర్చి ఆమె చర్చింపగలదు, కాని వైరాగ్య మహాభావం ఆమెకు ప్రత్యక్షము కాలేదు. తనది వైరాగ్య జీవితమే అని ఆమెకు తెలియదు. చిన్నతనంనుంచీ విచిత్రమైన ఈ వైరాగ్య జీవితం తనకెందుకు అలవడిందో ఆమె యెరుగదు. అనేక వసంతోత్సవాలు వెళ్ళిపోయినాయి. మధుమాస పరిమళించే ఆమె ఒక్కక్షణమైనా పులకిత కాలేదు. ఆమెకీనాడు బ్రహ్మదత్త ప్రభువు చదువు ప్రారంభించినారని పెద్ద ఆశ్చర్యమూ కలుగలేదు. విసుగు చెందనూ లేదు. ఆ చదువుకు పూర్వం ఎంత నిశ్చలమై ఉన్నదో ఆ పిమ్మటను అంతే నిశ్చలత.

ఆమె నెమ్మదిగాలేచి లోనికి వెళ్ళిపోయింది. తన పూజాగృహంలో బుద్ధదేవుని ఎదుట పద్మాసనాసీనయై ఆర్య ఘోషుని బుద్దచరిత్రనుండి అనేక ఘట్టాలు పఠించింది. కాని ఆమెకు భక్తితన్మయత కలుగలేదు.

చదవడం మానివేసింది. మనను నిశ్చలతనందింది. శూన్య మనస్సుతో అలా కూర్చుండిపోయింది. ఆమె మందిరంలో ఉన్న బుద్దవిగ్రహములు అలాగే ఉన్నాయి. దీపాలు చిరుగాలులకు ఇటూఅటూ కదులుతున్నాయి. చిత్రాలేమీ లేని ఆ గోడపైన వెలుగునీడల ఛాయలుమాత్రం ఆడుతున్నాయి. కదలికలేని క్షణాలుమాత్రం కదలి పోతున్నాయి. ఆ బాలికా సౌందర్యకాంతిలోని ప్రతితేజఃకణమూ ప్రతిక్షణంతోను వియ్యమంది, అనంత సృష్టిసౌందర్య లేశాతిలేశంలోనూ ప్రత్యేక విలీనత నందింది. ఆ విచిత్రత ఆ బాలికకేమి తెలియును! ఆమె అలా నిశ్చలతలోనే స్థాణువై కూర్చున్నది.

15

ఇక్ష్వాకుశాంతిమూల మహారాజు అంతులేని ఆలోచనలతో తన ఆనంద గృహాన ఒక బంగారు మజ్చిపీఠముపై త్రిభంగాకృతిని కూరుచుండెను. వెలుపలి మందిరంలో నలుగురు విలాసినులు సంగీతకళాకోవిదలు కాకలీస్వనాలగాన మొనర్చుచుండిరి. ఒకతె

అడివి బాపిరాజు రచనలు - 6

40

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)