పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలికకైనా చదువు చెప్పలేదు. బాలికకు చదువు చెప్పటానికి ఆ యువక ప్రభువు కొంచెం సిగ్గుపడ్డాడు. అందులో మహారాజకుమారిక! తాను వృద్దుడైతే భయములేకపోవును. యువకుడు, బ్రహ్మచారి, ఆవల పెళ్ళి కాని బాలిక! మహారాజు ఈ విచిత్రస్థితి ఎందుకు కొనివచ్చినారు? ఆ బాలిక తెలివయినదీ, ప్రజ్ఞావంతురాలు అవును. కానీ ఎంతసేపూ ధర్మము, భిక్షుకత్వము, అష్టమార్గాలు అంటూ కూర్చుంటుందనీ విన్నాడు. తాను మధ్య మధ్య ఇంచుక పరిహాసముగా మాటలాడినా ఆమె ఈషణ్మాత్రం స్పందించ లేదు. నవ్వలేదు. ఆమె మోము వెన్నెలలో కైలాస పర్వత శిఖరంలా ఉన్నది. ఆ మోమున కదలిక లేదు. అది స్థాణుత్వమేనా అని ప్రశ్నించుకొన్నాడు బ్రహ్మదత్త ప్రభువు.

14

చదువు హాస్యభాజనమనిగాని, అర్థము లేనిదనిగాని శాంతిశ్రీ రాకుమారి నిరసించలేదు. ఆ చదువు తనకు పనికిరాదనిగాని ధర్మబోధకమనిగాని ఆ బాలిక క్రోధపూరిత కాలేదు. ఆమె చిన్ననాటినుండి కోపతాపములు ఎరుగదు. ఇంత శిశువై ఉన్న కాలంనుంచి ఆమెకు కోరికలు లేవు, ప్రేమ లేదు. ఆమెకు ఆనందం లేదు, విచారం లేదు. ఆమె అడ్డాలనాటినుండి నవ్వి ఎరుగదు. ఆనందముచేగాని విచారంవల్లగాని కంటిచుక్కలు ఆమె రాల్చ లేదు. ఆమె ఎప్పుడు మంకుపట్టు ఎరుగదు, సులభంగా లొంగిపోనూలేదు.

పొత్తిళ్ళనాడే ఆమె అందం మంత్రసానులకు తెలిసింది. వాళ్ళు పూట పూటకూ దృష్టి తీసేవారు. ఆ తెల్లటి వళ్ళు ఉష్ణజల స్నానం చేయించినప్పుడు ఎఱ్ఱకమలంలా కందిపోయేది. పనసతొనల బంగారంలో తురిమిన నక్షత్ర కాంతి రంగరించిన శిశువై పెరుగుతూ ప్రపంచాన్ని శూన్యవిలోకనాల చూచే ఆ బాలికను కనుగొని, ఆకలి యైనప్పుడు మాత్రం ఏడిచే ఆ బిడ్డను అవలోకించి కౌగిలించుకొన్నా స్పందింపక మోమున ఏమాత్రమూ మార్పురాని ఆకొమరితను పారకించి, ముద్దులకు మోముముడిచి విసుగు చూపించి, పలకరిస్తే ఇంచుకయినా ప్రత్యుత్తరమీయని ఆ విసుగును పరిశీలించి మహారాజూ, మహారాణీ ఇద్దరూ వెర్రిబాలిక ఏమో అని పైకిపొంగని బెంగపెట్టుకొన్నారు.

మహారాజు ఎన్ని విచిత్రాలైన ఆటవస్తువులు ఇచ్చినా ఆ బాలికలో ఏమీ మార్పు వచ్చేదికాదు. కిలకిల నవ్వేదికాదు. చప్పట్లుకొడుతూ కోడుతూ గంతులువేసేది కాదు. “నాయనగారు నాకివి ఇచ్చారు” అని తల్లితో చెప్పేది కాదు. బొమ్మలను “పాపాయి!' అని ఎత్తుకొనేదికాదు. ఆ పాపాయికి నీళ్ళు పోసేదికాదు. దంతపుబొమ్మ రథాలు నడిపింపలేదు. లాక్షావర్ణ విచిత్రలతా విన్యాససుందరమైన ఆటపడవల తన బొమ్మ కాలువలలో ఆమె ప్రయాణింప చేయలేదు. తోటి బాలికలు మేనత్తల కొమరితలు శాంతశ్రీ బాపిశ్రీలతో ఆ బాలికకు నేస్తమూలేదు. కయ్యమూ లేదు. చీనాంబరాలుకట్టి ముద్దులు గులిగే నగలు తల్లి ధరింపజేసినా శాంతిశ్రీలో ఏమీ సమ్మోదములేదు. ఆమెకు నగలు ధరించాలని ఇచ్చలేదు. సాధారణపు నగలు, సాధారణ వస్త్రాలు ధరించి ఉండేది. ఆమెను మహారాజు కొమారికగా అలంకరిస్తే అవసరమున్నంతవరకే అవి ఉంచి తర్వాత తీసివేసేది.

అడివి బాపిరాజు రచనలు - 6

39

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)