పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, యీ బాలిక, యీ పరమసుందరి, దివ్యగాత్ర తనకారీతి ప్రత్యక్షమైన మఱుక్షణమునుండి తన జీవితమున నేదియో అమృతశాంతి యలముకొన్నట్లయినదీ. ఏ సామంతుని కొమరితయో యీ బాలిక!

13

గౌతమీ కార్తీక స్నానవ్రతమును సమాప్తము గావించి విష్ణుకుండిన రాజకుమారి అంశుమతి వేంగీపురము చేరుకొన్నది. స్నానవ్రత మాహాత్య్మమో, మరియే కారణమో అంశుమతి గోవూరునుండి వచ్చిన నాటనుండియు నానందముచే గలకలలాడిపోవు చుండెను. ఆమె యెప్పుడును నెవియో పాటలు పాడుచునేయుండును. తానేర్చిన నాట్యకళా వైదుష్యమంతయు వెల్లి విరియ తా నాడును, చెలికత్తియల నాడించును. సన్నిహిత భాంధవియగు మాధవిచే నుషాబాల వేషము వేయించి, తా ననిరుద్ధుడై యవరోధ జనము నెదుట నుషాపరిణయ నాటకమును బ్రదర్శించినది. ఉష యాంధ్రుల యాడుబడుచు. ఉషకు బడమటి నుండి యనీరుద్దుడు వేంచేసినాడు! ఆమె తనలో నవ్వుకొన్నది. ఏమి తనకీ యానందము!

ఆ నాటక మెంతయో రక్తిగట్టినది. మహారాణి తన కొమరిత నాట్యకౌశలమున కెంతయో పొంగిపోయినది. సంజ్ఞాదేవి హైహయుల యాడుబడుచు. కోనదేశాధిపతి యగు హైహయ మాధవవర్మమహారాజు సూర్యోపాసకుడు. బిడ్డలకై సూర్యు నారాధించి, కొమరితయగు సంజ్ఞాదేవిని, కొమరు డాదిత్యవర్మను బడసెను. హైహయులు విష్ణుకుండి నలును దగ్గఱి బంధువులు. సంజ్ఞాదేవి విష్ణుకుండిన యువ మహారాజు మంచన భట్టారకునికి ఉద్వాహము గావింపబడి యువరాణి యయినది. నేడు రాణి.

మహారాణి కొమరిత నంతఃపురమునకు గొనిపోయి తన మాంగళ్యమందిరమున గాశ్మీర దుకూలాంబర రత్న కంబళముపై నధివసించి, యుపధానముల నానుకొని, కొమరితను దగ్గఱగ గూర్చుండ బెట్టుకొన్నది.

"తల్లీ! మహారాజు నీ వివాహ విషయమున బెంగగొని యున్నారు. అనువైన సంబంధముల నన్నింటిని వలదంటివి. కళింగ గాంగులు, కాంచీపుర పల్లవులు, వాతాపి చాళుక్యులు బలవంతులై విష్ణుకుండిన వేంగీరాష్ట్రములకు శత్రువులై యీ రాజ్యమును హరింప గంకణము ధరించినారు” అని కొమరిత వైపు విచారము కుములుకొను తన మోమును తిప్పినది.

“అమ్మగారూ! నాయనగారు ధీరశాంతులు. వారికి యుద్దమన విముఖత్వము. వారు సర్వధర్మప్రియులు. తాము చిత్రరథస్వామి భక్తులయ్యు, జైనులను, బౌద్దులను, శైవులను, బూర్వమీమాంసకులను సమానప్రేమతో నాదరించుచున్నారు. వివిధ ధర్మావలంబములైన సంస్థలకెల్లను నెన్ని గ్రామములు ధనరాసులు దానము లీయలేదు!”

“అవును తల్లీ! వారు నీ కొఱకై తమ రాజ్యమునే దానమిచ్చుటకు సంసిద్దులుగా నున్నారు గదా!”

“నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు. ఆ యీ సంభాషణలలో వారాభావమును వెల్లడించుచునే

అడివి బాపిరాజు రచనలు - 6

259 అంశుమతి (చారిత్రాత్మక నవల)