పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతాపముచే నరకము వంటి యీ కారాగారమునుండి మాకు విముక్తి ప్రసాదింప బడినది. ఆ మహారాజునకు మా రాకుమారి యెంతయు గృతజ్ఞురాలు.”

“మా మహారాజు కళింగనగరముపై జైత్రయాత్రకు బోవుచున్నాడు. మీ రాజకుమారిని సర్వ మర్యాదలతో గోవూరు పురమునకు గొనిపోవ నాజ్ఞయిచ్చిరి.

ఇంతలో దూరమునుండి “మహారాజకుమారీ! మహారాజకుమారీ!” యని మాధవి కేకలు వినవచ్చినవి.

“ప్రభూ! ఇక సెలవు. మహారాజకుమారిని మాధవి కాబోలు పిలుచుచున్నది. నన్ను కిరణవతి యని మీరు పిలువవచ్చును” అని అంశుమతి చిరునవ్వు నవ్వుచు “మీకు నాయీడు ఉండునని అనుకొందును. భగవంతుడు మీ మహారాజును సర్వవిధముల రక్షించుగాక!” అనుచు నంశుమతి విసవిస నడిచిపోయినది.

ఓహో! ఏమి యీ బాలిక సౌందర్యము. జగన్మోహిని. విష్ణుకుండిన మహారాజునకు సామంతుడైన ప్రభు వెవ్వరికో యీమె తనయయై యుండవచ్చును. ఏమి మధుర కంఠము! ఆమె మాటలు కోకిల పులుగు కువకువలువలె దేనియలు చెమరించినవి. తానింతవరకు స్త్రీల నెవ్వరి నిటుల పలుకరించి యుండలేదు. ఈ బాలికకు వివాహమై యుండ నేరదు. అయినచో రాజకుమారికి సఖిగా నెట్లు రాగలుగును?

అందరివలెనే యీ బాలయు దన్ను బాలకు డనుకొనినది. ఆమె యీడెంత యైయుండును! పదునేడు పదునెనిమిది వర్షముల పడుచుప్రాయము. ఈ బాలిక తన్ను బదునెనిమిది వత్సరముల బాలుడని యెంచినది కాబోలు, అని ఆ యువమహారాజు మనస్సు కొంచెము భిన్నమయ్యెను.

తన వంశమున నేరును బొట్టివారు ఉద్భవించలేదట. తాను బూర్వజన్మమునందే కుబ్జుని జూచి పరిహసించెనో యీ జన్మమున నిట్లుద్భవించినాడు. కాని తాను మరుగుజ్జు మాత్రము గాదు. బాలకునివలె గన్పించును. అయినను తన పూర్వకర్మము వలననో, భగవంతుని కృపవల్లనో సంభవించిన ఈ వామనత్వమున కీ పది సంవత్సరములనుండియు తన మనస్సు అప్పుడప్పుడు దుఃఖము నందుచు దన్ను గుజ్జువానిగ నెంచినవారి నెల్లరను ద్వేషించుచు నానాటికి గర్కశత్వమును దాల్చినది.

తనలోని క్రోధమునకు దానే భయపడిపోవువాడు. ఆ క్రోధము తన్నే దహించివేయు ననుకొన్నాడు. లోక మసహ్య మయిపోయినది. లోకప్రఖ్యాతి నంది, చతుస్సముద్ర వేలాయత మహాసామ్రాజ్యమును పాలించుచున్న పరమ బ్రహ్మణ్యుడైన తన అన్నగారు తన్నపరిమిత ప్రేమతో హృదయమునకు హత్తుకొని నప్పుడా ప్రేమ కరుణచే జనించిన దనుకొని తా నెంతయో బాధ నందినాడు. తన పెద్దతమ్మునికన్న జిన్నతమ్మునిపై నెక్కుడు ప్రేమ గలుగుట కీ మరుగుజ్జుతనమె కారణమని యాతడు పొందిన వేదన వర్ణనాతీతమై పోయినది. అన్నగారు, చిన్నన్నగారు నిరువుర దనపై జూపుప్రేమకు గారణము, జాలిగాదని యెన్ని యో సారులు నిర్ధారితమైనను ఆ యనుమాన మప్పుడప్పుడు పీడించుచునే యున్నది.

అడివి బాపిరాజు రచనలు - 6

258

అంశుమతి (చారిత్రాత్మక నవల)