పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నారు. కాని, నేను మాత్రమెన్నియో మారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహాసామ్రాజ్యమును సుస్థిర మొనర్పజాలక పోతిననియు దుఃఖించితిని. ఏమి రాజ్యములు, ఏమి రాజులు! కాకులవలె గ్రద్దలవలె సైన్యములు సమకూర్చుకొని యనిత్యమును, గల్మశమునగు కీర్తికై యొకరి తల నొకరు నఱుకుకొనుచు, నొకరి రాజ్య మొకరు హరించుచున్నారు.”

“అవును కన్నతల్లీ! నీవు బాలకుడవై పుట్టవలెనని వాంఛించినట్లీ నీ వేషమే నిదర్శనము. ఎంత జక్కగ నభినయించితివి. నాకు నీవు బాలకుడ వయియే జనించితివేమో యని యొక నిమేషమాత్ర మనిపించినది. నీ వన్నట్లు రాజ్యము లెప్పుడును పాపకరములు. అహింసావ్రతమే ముక్తికి నిజమైన మార్గము. ఇతరులకు హానిచేయుట కన్నదన్ను దాను హింసించుకొని జినదేవలోకము నార్జించుట పరమధర్మమన్నారు...”

“ఏమిటా మాటలు జననీ! నే నీ వారము దినముల నుండియు నే కారణముననో ఆనందము నందుచు బొంగిపోవుచున్నాను. నా కీ పొడియారిన వేదాంతపు మాట లెందుకు? నా వివాహము విషయమై మాట్లాడుటకు దీసికొని వచ్చినారు. నే నొక పరమపురుషునికై యెన్ని యుగముల నుండియే యెదురు జూచుచున్నట్లుగ దోచెడిది. నేడు నాకా మహాభాగుడు పిష్టపురమున దర్శన మిచ్చినాడు. వాతాపి చాళుక్య సామంతులలో నొక ప్రభువు కుమారు డాతడు. పిష్టపుర రాణివాసపు టుద్యానమున నా వీరుని దర్శనమును హఠాత్తుగ బొందగలిగితిని”

“ఏమిటి? కన్నతల్లీ! ఎవరిని దర్శించితి నంటివి?”

“నా చేయిని గ్రహించి, నన్నీ లోకయాత్రలో దివ్యపథములకు గొనిపోగలిగిన నా నాయకుని సందర్శించితిని.”

“అదేమీ తల్లీ! ఒక సామాన్య సామంతుని నీవు వలచినావా! ప్రేమించినావా!”

“అవును అమ్మగారూ! అవును. అది ప్రేమయో, వలపో, నాకు దెలియదు, ఆతనికి నేనా పవిత్రక్షణముననే నా హృదయమును, నా సర్వస్వము నర్పించుగొంటిని. ఆయన సామాన్యుడగు సామంతుడైనను, చక్రవర్తియైనను నా కాతని స్థితితో నవసరము లేదు. ఆతడు చాళుక్య యువరాజైన విష్ణువర్థన మహారాజుతో గలసి కళింగ గాంగ మహారాజులపై దాడి వెడలినాడు. నా హృదయ మాతని కర్పించితినమ్మా.”

ఆ బాలిక మహారాణి కంఠమును బిగియార గౌగిలించి యామె హృదయమున దన మోము గాఢముగ నదిమి కొనుచు “అమ్మా నా కే మహారాజును, జక్రవర్తియు వలదు. నా కేడుగడయైన యా ప్రియదర్ని నిర్వక్ర పరాక్రములని నా హృదయమున వెంటనే స్పురించినది.” అని డగ్గుత్తికపడ్డ మాటలతో నా బాలిక తన హృదయరహస్యమును వెల్లడించెను.

మహారాణి నిరుత్తరయే యేమియు మాట్లాడనేరక తన కూతురును హృదయమునకు గాఢముగ హత్తుకొన్నది. మఱునాడు నారసింహభట్టుపండితులవారిని విష్ణుకుండిన మహారాజు తమ యాలోచనా మందిరమునకు రప్పించుకొనిరి.

అడివి బాపిరాజు రచనలు - 6

260

అంశుమతి (చారిత్రాత్మక నవల)