పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 వేంగీరాష్ట్ర పశ్చిమారణ్యములజొచ్చి విష్ణువర్ధనుడు తన సైన్యము నుత్తరదిక్కునకు మరలించినాడు. పిష్టపురమును దిరిగి యాక్రమించుకొనిన గాంగులు విష్ణువర్ధనుడు వేంగీనగరముపై పోవుచున్నాడని నమ్మిరి. వా రట్లు నమ్ముటకే యా యువప్రభువు కాలకంపను నాలోచన పెడచెవిని బెట్టి, వేంగీనగరమునకే తన సైన్యముల నడిపించుకొని పోవుచున్నట్లే నటించినాడు. చాళుక్య సైన్యములు ప్రథమముననే వేంగీనగరమును ముట్టడించినచో శాంతచిత్తుడును దుర్భలుడును నగు విష్ణుకుండిన మహారాజు త్వరలో లోబడునని పిష్టపురమున నుండిన గాంగులును, గాంచీపురమున నుండిన పల్లవులును అనుకొనిరి, వేంగీపురమున విష్ణువర్థనుడు నిలిచి యున్నచో వారందరు ముట్టడింతురేమో యన్నభయము కాలకంపనునికి గలిగినది. ఆభావమా యువరాజు గ్రహింపకపోలేదు. కాని యాతడు తన రహస్యాలోచనల నేరికిని దెలియనీయడు. కాలకంపనుడును సర్వసైన్యములును గూడ విష్ణువర్థనుడు వేంగీపురాభిముఖుం డయ్యెననియే తలంచిరి. ఇప్పుడు చటుక్కున నా మహారాజు తన సైన్యముల నుత్తరపు దిక్కునకు ద్రిప్పి కీకారణ్యములమధ్య నడిపించుకొని పోవునప్పుడు కాలకంపనునికి విష్ణువర్ధనుని హృదయ మర్థమైనది.

ఉన్నట్లుండి యొకరాత్రి చాళుక్య సైన్యములు పట్టిసమున కెదురుగనున్న తాళగ్రామము చేరుకొన్నవి. ఆ యుదయమే నిశితబుద్దిగల చాళుక్యచరులు గొందఱు గోదావరీతీరమున నున్న కొన్ని గ్రామములలో నొకరికితెలియకుండ మరొకరికడ పడవలను తెప్పలను మాటలాడి యుంచినారు. ఆ నడిరేయి పడవలు దెప్పలును దాళగ్రామమువైపు జేరినవి. అప్పుడే యచటికి విచ్చేసిన చాళుక్య సైన్యములు నిశ్శబ్దముగ నావలియొడ్డునకు జేరినవి.

ఆవలి రేవు చేరుటేమి చాళుక్యసైన్యములు సువేగమున దమ ప్రయాణములు సాగించినవి. గాంగుల సైన్యము లన్నియు పిష్టపురమున లేవు. గోదావరీతీరము పొడవునను నా సైన్యములు కావలికాయుచుండెను. విష్ణువర్ధనుడు వేంగీపురమును బట్టుకొనిన వెనుక గోదావరిని దాటి, కళింగమును జేరకుండ జేయుటయే వారి తలంపు. విష్ణువర్థనుడు ప్రయాణమాపక, పోయిపోయి షిష్టపురమును ముట్టడించెను.

9

పిష్టపుర నగరము చుట్టును మూడు మహాకుడ్య శ్రేణులున్నవి. ఉత్తుంగములైన నలుబదిరెండు గవను (బురుజు)లున్నవి. నగరము చుట్టును త్రవ్వని అగడ్తయై హేలనది ప్రవహించును. వర్ష కాలమునందు దప్ప ఇతర సమయములందీ నదిలో నీరుండక పోవుటచే బిష్టపుర ప్రాచీన మహారాజులైన మాఠరులును, వారివెనుక సాలంకాయనులకు, విష్ణుకుండిసులకును సామంతులైన రామకాశ్యపులును హేలానదికి (నేటి యేలేరు) ఆనకట్టలు గట్టి, పండ్రెండు నెలలును లోతుగా నీరుండునట్లు చేసిరి. ఈ నది కుపశాఖలు నగరము నందు బ్రవహించుచు నొక్కొక శ్రేణికి నగడ్తలుగా నేర్పడినవి. బాహ్య కుడ్యశ్రేణీకన్న నెత్తైన మధ్యకుడ్యశ్రేణియు, నంతకన్నను నెత్తైయున్న యంతర్భిత్తికా శ్రేణియు

అడివి బాపిరాజు రచనలు - 6

• 248 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)